
రోహిత్ శర్మ డౌట్..
మూడో టీ20లో వెన్నుగాయానికి గురైన రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆ మ్యాచ్‌లో కేవలం ఐదు బంతులు మాత్రమే ఆడిన రోహిత్.. వెన్ను గాయం కారణంగా రిటైర్ట్ హార్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం గాయంపై స్పందించిన రోహిత్ ప్రస్తుతానికి బాగానే ఉందని, కానీ నాలుగో, ఐదో టీ20ల వరకు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేనన్నాడు. అయితే రోహిత్ ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, నాలుగో టీ20లో జట్టును నడిపిస్తాడని టీమ్ వర్గాలు పేర్కొన్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది. అయితే భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో అతన్ని ఆడించి రిస్క్ చేయకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడు.

సంజూ శాంసన్‌కు చాన్స్..
మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా సూర్య విఫలమైనా.. మూడో మ్యాచ్‌లో దంచికొట్టాడు. ఇక ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్‌పై వేటు పడనుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 0, 10, 23 విఫలమయ్యాడు. అదే జరిగితే కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌కు అవకాశం దక్కుతుంది. వన్డే సిరీస్‌లో రాణించిన సంజూ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నాలుగో స్థానంలో రిషభ్ పంత్, ఐదో స్థానంలో దీపక్ హుడా, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. గత మ్యాచ్‌లోనే అవకాశం అందుకున్న దీపక్ హుడా.. తన స్థానాన్ని రిటైన్ చేసుకోనున్నాడు.

అశ్విన్ డౌట్..
ఏడో స్థానంలో విధ్వంసకర హిట్టర్ దినేశ్ కార్తీక్ ఆడనుండగా.. 8వ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. గత మ్యాచ్‌కు గాయంతో జడేజా దూరమవ్వగా దీపక్ హుడా జట్టులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌కు కూడా జడేజా అందు బాటులో ఉండకపోవచ్చు. అయితే రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లో ఒకరు ఈ స్థానంలో ఆడనున్నారు. పరిస్థితులకు తగ్గట్లు టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది.

హర్షల్ పటేల్‌కు చోటు..
బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు జరగనున్నాయి. గాయంతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన హర్షల్ పటేల్ కోలుకుంటే ఈ మ్యాచ్ బరిలోకి దిగనున్నాడు. భువనేశ్వర్ కుమార్‌కు రెస్ట్ ఇచ్చి అతన్ని ఆడించనున్నాడు. అర్షదీప్ సింగ్ అతనికి అండగా ఉండనున్నాడు. ఇక మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఆవేశ్‌ఖాన్‌పై వేటు పడనుంది. మూడు మ్యాచ్‌ల్లో 5.2 ఓవర్లు వేసిన ఆవేశ్ ఖాన్ 14.62 ఎకానమీతో పరుగులిచ్చాడు. ఈ క్రమంలోనే అతన్ని తప్పించి స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించనున్నారు.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్/అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్