ఎవరికైనా సరే.. ఓ రోజు వస్తుంది... ఆరోజున తనపై పూలవర్షం కురుస్తుంది... అది ఇదే. జట్టు నుంచి తీసేస్తారు.. మళ్లీ అవకాశం ఇస్తారు... మొత్తంగా తనతో మ్యూజికల్ ఛైర్ ఆడుకుంటారు. కానీ ఈరోజు...ఎందరికో సమాధానం చెప్పాడు అతను. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అందుకు టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజూ శాంసనే ఓ పెద్ద ఉదాహరణ.
భారత జట్టుకు భారమని ఛీ కొట్టినోడే.. ఒంటి చేత్తో టీమిండియాను సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఇతర తోపులు అభిషేక్, ఇషాన్, తిలక్, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ అందరూ కట్టకట్టుకొని విఫలమైన వేళ.. తానొక్కడే నిలబడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆశమాషీ ఇన్నింగ్స్ కాదిది.. జీవితానికి సరిపోయే ఆట ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌ను యావత్ క్రికెట్ ప్రపంచం చానా ఏళ్లు గుర్తుంచుకుంటుంది.
వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లాంటి సూపర్-8 పోరులో సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా 6, 4 బాది భారత విజయాన్ని లాంఛనం చేసిన సంజూ.. తనదైన స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు. మోకళ్లపై కూర్చొని దేవుడికి ప్రార్థన చేశాడు. పెవిలియన్ వైపు నడుస్తున్న అతనికి కెప్టెన్ సూర్య..టోపీ తీసి తలవంచి గౌరవ వందనం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఎందుకంటే ఇదే సూర్య.. సంజూ శాంసన్‌పై ఎటకారం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు సంజూ శాంసన్‌ను తుది జట్టులో ఆడిస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎటకారంగా సమాధానమిచ్చాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఎవరి స్థానాల్లో సంజూను ఆడించాలి? అని తక్కువ చేసి మాట్లాడాడు. కానీ అదే సూర్య.. నేడు సంజూకు తల వంచి గౌరవ వందనం చేశాడు. ఎవరికైనా సరే.. ఓ రోజు వస్తుంది...ఈ రోజు సంజూ శాంసన్‌దే.
అన్నట్లు.. ఎవరి కోసం అయితే సూర్య విర్రవీగాడో.. వారిని రక్షించేందుకు అతనికి మళ్లీ సంజూ శాంసనే దిక్కయ్యాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరు లెఫ్టార్మ్ బ్యాటర్లు కావడంతో ప్రత్యర్థి జట్లు తొలి ఓవర్ నుంచే ఆఫ్ స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించి ఇబ్బంది పెడుతున్నాయి. లెఫ్టార్మ్ బ్యాటర్లకు ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టం. అంతేకాకుండా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలకు ఆఫ్ స్పిన్నర్ల బలహీనత ఉంది. దాంతో కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సంజూ శాంసన్‌ను ఆడించక తప్పలేదు. చివరకు ఆ సంజూనే టీమిండియాను సెమీఫైనల్ చేర్చాడు.