టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్ చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ ఆటతీరు అస్సలు మారడం లేదు.
ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ.. జింబాబ్వేతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ కీలకమైన వెస్టిండీస్‌తో 10 పరుగులకే వెనుదిరిగాడు. ఆఫ్ స్పిన్నర్‌ను ఆడటంలో తన తడబాటును కొనసాగిస్తున్నాడు.
6 మ్యాచ్‌ల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. మునపటిలా స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోతున్నాడు. బ్యాటింగే కాదు.. ఫీల్డింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. విండీస్‌తో మ్యాచ్‌లో రెండు సునాయసమైన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. సంజూ శాంసన్ పుణ్యమా.. ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కింది. లేకుంటే అభిషేక్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవాడు. అతన్ని పక్కన పెట్టి రింకూ సింగ్ లేదా ఎక్స్‌ట్రా బౌలర్‌ను ఆడించాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు.

అభిషేక్ శర్మ జట్టుకు భారంగా మారాడని మండిపడుతున్నారు. అభిషేక్ శర్మ కాటేరమ్మ కొడుకు కాదని, శాతగాని కొడుకు అని ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. సంజూ శాంసన్ ఫామ్‌లోకి వచ్చిన నేపథ్యంలో అభిషేక్ శర్మను పక్కన పెట్టి ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించినా తన శైలికి భిన్నంగా ఆడాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మకు బదులు ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), రోవ్‌మన్ పోవెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), జాసన్ హోల్డర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/36) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్(2/38), షమార్ జోషెఫ్(2/42) రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సేన్ ఒక వికెట్ తీసాడు.