ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన టీమిండియాకు అభినందనలు తెలుపుతూ.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌కు గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. స్టేడియంలో ధోనీని చూడటంతోనే తన ముఖంలోకి చిరునవ్వు వచ్చిందని పేర్కొన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేయగా.. న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో టీమిండియా మూడో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడటంతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా.. సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన టీమ్‌గా చరిత్ర సృష్టించింది.

సాధారణంగా మొబైల్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోనీ.. భారత ప్రపంచకప్ విజయంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చిరునవ్వు బాగుందని, దాన్ని అలానే కొనసాగించాలని సూచించాడు. 'అహ్మదాబాద్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియాకు, సపోర్ట్ స్టాఫ్‌కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఆడుతుంటే చూడటం చాలా ఆనందంగా ఉంది. కోచ్ సాబ్.. మీ ముఖంలోని ఆ చిరునవ్వు చాలా బాగుంది. విజయం సాధించాలనే నీ పట్టుదల, ఆ చిరునవ్వు కిల్లర్ కాంబినేషన్. వెల్ డన్! ఈ విజయాన్ని ఆస్వాదించండి గైస్. బుమ్రా గురించి నేను ఏమీ రాయకపోవడమే మంచిది. అతను ఒక ఛాంపియన్ బౌలర్.'అని ట్రోఫీతో ఉన్న భారత జట్టు ఫొటోను ధోనీ షేర్ చేశాడు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కాగా.. ధోనీ చమత్కారానికి గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. 'ధోనీ.. మైదానంలో నిన్ను చూసిన సంతోషంలో వచ్చిన చిరునవ్వు అది'అని గంభీర్ బదులిచ్చాడు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. టీ20 ప్రపంచకప్ విజయానంతరం నవ్వుతూ కనిపించాడు. ఈ విజయానంతరం అర్ష్‌దీప్ సింగ్ సైతం.. 'గౌతమ్ పాజీ ఇకనైనా నవ్వండి'అని రీల్ చేశాడు. హెడ్ కోచ్‌గా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న గంభీర్.. తన హయాంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని దేశానికి అందించాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ హాజరయ్యాడు. మ్యాచ్‌కు ముందు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చాడు. దిగ్గజ కెప్టెన్ కపీల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవ్వడం విశేషం.