సంజూ శాంసన్ అసాధారణ ప్రదర్శనే తమకు విజయాన్ని అందించిందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఈ గెలుపు గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తమ కుర్రాళ్లు సత్తా చాటారని సంతోషం వ్యక్తం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒక్కడే అసాధారణ బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. సంజూ బ్యాటింగ్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. 'నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి. ఈ మ్యాచ్ మాకు చావో రేవో లాంటిది. మా కుర్రాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఓపికగా వేచి ఉండే మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుందని నేను నమ్ముతాను. జట్టులో లేనప్పుడు అతను తెర వెనుక పడ్డ కష్టం.. చేసిన కృషికీ సరైన సమయంలో తగిన ఫలితం దక్కింది. అతను ఆడిన తీరు వల్లే జట్టు గెలిచింది.
మా బౌలర్లు ప్లాన్ ప్రకారమే బౌలింగ్ చేశారు. ఇక్కడ మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి, బంతి బ్యాట్ మీదకు వస్తుందని, 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చని మాకు తెలుసు. ఆ తర్వాత మా బ్యాటర్లు చిన్న చిన్న భాగస్వామ్యాలతో స్పందించిన తీరే విజయానికి కీలకం.
సెమీస్ చేరడం చాలా సంతోషంగా ఉంది. మొదటి మ్యాచ్ నుంచి మేం ఆడిన విధానం చూస్తుంటే, ఖచ్చితంగా సెమీస్ స్థానానికి మేము అర్హులం. అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ మైదానంలో ఏం చేయాలో మనకు తెలిసి ఉండాలి. మనపై చాలా మంది అంచనాలతో పాటు ఒత్తిడి ఉంటుందని మా కుర్రాళ్లకు చెప్పాను. కానీ ఇలాంటి మ్యాచుల్లో ధైర్యంగా ఉంటూ.. ఒత్తిడిలో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడి లేకపోతే అందులో కిక్కు ఉండదు. కడుపులో గందరగోళంగా అనిపిస్తుంది. కానీ దాన్ని ఎలా అర్థం చేసుకుని ముందుకు వెళ్తామన్నదే ముఖ్యం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.