ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన టీమిండియాకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభినందనలు తెలిపాడు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు భారత క్రికెట్ అభిమానులందరికీ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పాడు. సాధారణంగా మొబైల్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోనీ.. భారత ప్రపంచకప్ విజయంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చిరునవ్వు బాగుందని, దాన్ని అలానే కొనసాగించాలని సూచించాడు. 'అహ్మదాబాద్‌లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. టీమిండియాకు, సపోర్ట్ స్టాఫ్‌కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఆడుతుంటే చూడటం చాలా ఆనందంగా ఉంది. కోచ్ సాబ్.. మీ ముఖంలోని ఆ చిరునవ్వు చాలా బాగుంది. విజయం సాధించాలనే ఆయన పట్టుదల, ఆ చిరునవ్వు కిల్లర్ కాంబినేషన్. వెల్ డన్! ఈ విజయాన్ని ఆస్వాదించండి గైస్. బుమ్రా గురించి నేను ఏమీ రాయకపోవడమే మంచిది. అతను ఒక ఛాంపియన్ బౌలర్.'అని ట్రోఫీతో ఉన్న భారత జట్టు ఫొటోను ధోనీ షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. టీ20 ప్రపంచకప్ విజయానంతరం నవ్వుతూ కనిపించాడు. ఈ విజయానంతరం అర్ష్‌దీప్ సింగ్ సైతం.. 'గౌతమ్ పాజీ ఇకనైనా నవ్వండి'అని రీల్ చేశాడు. హెడ్ కోచ్‌గా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న గంభీర్.. తన హయాంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని దేశానికి అందించాడు.
టీ20 ప్రపంచకప్ విజయాన్ని మాజీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. కోచ్‌గా తాను ఉన్నన్ని రోజులు.. వ్యక్తిగత మైలురాళ్ల కంటే ట్రోఫీలకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ హాజరయ్యాడు. మ్యాచ్‌కు ముందు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చాడు. దిగ్గజ కెప్టెన్ కపీల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవ్వడం విశేషం.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేయగా.. న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో టీమిండియా మూడో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడటంతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా.. సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన టీమ్‌గా చరిత్ర సృష్టించింది.