కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌పై విజయంతో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక విజయానికి సూత్రధారి సంజు శాంసన్ తన బ్యాటింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. మ్యాచ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సంజు శాంసన్‌ను ఆత్మీయంగా హత్తుకోవడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒంటరి పోరాటంతో సెమీస్‌కు బాట
వెస్టిండీస్ విధించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆరంభంలోనే తడబడింది. కానీ క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లోనే 194 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 97 పరుగులు సాధించి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. సంజు శాంసన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. 19.2 ఓవర్లలోనే భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

గంభీర్ ఆత్మీయ ఆలింగనం
విజయానంతరం మైదానంలో ఒక భావోద్వేగ దృశ్యం కనిపించింది. సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌ను చూసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేరుగా మైదానంలోకి వెళ్లి సంజును గట్టిగా హత్తుకున్నారు. గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంజుకు ఈ ఇన్నింగ్స్ అత్యంత కీలకం. విమర్శకులు నోరు మూయించేలా ఆడిన ఈ ఇన్నింగ్స్ తర్వాత, గంభీర్ అతనికి అభినందనలు తెలిపిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సంజును ఎప్పుడూ వెనక ఉండి ప్రోత్సహించే గంభీర్.. ఈ విజయంతో మరింత సంతోషంగా కనిపించారు.
గంభీర్ మనసులోని మాట
మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో గంభీర్ సంజుపై తనకున్న నమ్మకాన్ని బయటపెట్టారు. "సంజు శాంసన్ కేవలం ఆటగాడు మాత్రమే కాదు, అతడొక వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతని ప్రతిభ గురించి ఎవరికీ సందేహాలు అవసరం లేదు. అతనికి కావాల్సిందల్లా జట్టు మేనేజ్మెంట్ నుండి సరైన మద్దతు మాత్రమే. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో, అది కూడా సెమీఫైనల్‌కు వెళ్లే కీలక మలుపులో అతను తన అసలైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు" అని గంభీర్ కొనియాడారు.
నిలకడపై నమ్మకం
గతంలో న్యూజిలాండ్ సిరీస్‌లో ఎదురైన వైఫల్యాలను ప్రస్తావిస్తూ.. "ఒక ఆటగాడికి ఎప్పుడూ విజయాలే రావు, కొన్నిసార్లు ఒత్తిడి నుంచి బయటపడటానికి విరామం కూడా అవసరం. సంజు ఖాతాలో మూడు టీ20 సెంచరీలు ఉన్నాయి, అది ఎంత గొప్ప టాలెంటో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ కప్‌లో మాకు ఎప్పుడు అవసరమైనా సంజు రాణిస్తాడని మాకు తెలుసు" అని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రెండు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో కూడా సంజు శాంసన్ ఇదే జోరును కొనసాగించి భారత్‌కు కప్ అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.