ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా విజేగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేయగా.. న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచిన టీమ్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియాకు ఇది మూడో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం.
విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు ఐసీసీ భారీ క్యాష్ ప్రైజ్ అందజేయనుంది. ఈ టోర్నీ కోసం ఐసీసీ మొత్తం 13.5 మిలియన్ డాలర్ల(రూ.120 కోట్ల) ప్రైజ్‌మనీ ప్రకటించింది. ఈ ప్రైజ్‌మనీని టోర్నీలో పాల్గొన్న జట్ల స్థానాల ఆధారంగా పంపిణీ చేయనున్నారు. ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ప్రైజ్‌మనీగా 3 మిలియన్ డాలర్లు(రూ.27.48 కోట్లు) దక్కనుంది. ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.6( రూ.14.65 కోట్లు) మిలియన్ డాలర్లు దక్కనుండగా.. సెమీ ఫైనల్‌లో ఓడిన జట్లకు 7,90,000 డాలర్ల(రూ.7.24 కోట్లు) ప్రైజ్‌మనీ లభించనుంది. సూపర్-8 చేరిన జట్లకు 380,000(రూ.3.48 కోట్లు) డాటర్లు, గ్రూప్ స్టేజ్‌లో జట్లకు 250,000(రూ.2.29 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కనుంది.

ఈ ప్రైజ్‌మనీ మొత్తం ఆటగాళ్లకు కాకుండా ఆయా దేశాల క్రికెట్ బోర్డుకు ఐసీసీ అందజేయనుంది. అయితే బీసీసీఐ ఈ ప్రైజ్‌మనీతో కలిపి విజేతగా నిలిచిన భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించే అవకాశం ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్‌ను ప్రకటించింది. ఇందులో ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు ఇవ్వగా.. రిజర్వ్ ప్లేయర్స్‌కు రూ. కోటి నజరానా అందజేశారు. సపోర్ట్ స్టాఫ్ కూడా సమానంగా ప్రైజ్‌మనీ ఇచ్చారు. ఈసారి కూడా అదే రీతిలో బీసీసీఐ భారీ నజరానా ప్రకటించే అవకాశం ఉంది.