న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2021: ఖతర్నాక్ ఆటతో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!

French Open 2021: Novak Djokovic Makes History With 19th Grand Slam Title In super Final aginst Stefanos Tsitsipas

పారీస్: నంబర్ వన్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ మాయ చేశాడు. ఈ తరంలో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఖతర్నాక్ ఆటతో ఫ్యాన్స్‌ను కనువిందు చేశాడు. అనూహ్యంగా తొలి రెండు సెట్లు కోల్పోయినా.. తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో పుంజుకున్న జొకో ఆఖరాటలో అద్భుతం చేశాడు. తొలుత తన తడబాటుతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ సెర్బియా స్టార్.. మ్యాచ్ సాగుతున్న కొద్ది తిరుగులేని ఆటతో చెలరేగాడు. 29 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన తన అనుభవాన్ని రంగరిస్తూ.. క్లాసిక్ షాట్లతో అదరగొడుతూ.. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న గ్రీస్ యంగ్ స్టార్ సిట్సిపాస్ పని పట్టాడు.

ఫలితంగా రోలాండ్ గారోస్ రెండో టైటిల్ ఓవరాల్‌గా 19వ గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకున్నాడు. స్విస్ గ్రేట్ రోజర్ ఫెడరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్(20 గ్రాండ్ స్లామ్స్)ను అందుకనేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచాడు. మరోవైపు తుది పోరులో ఓడినా సిట్సిపాస్ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. తొలి సారి ఓ బిగ్ టోర్నీ ఫైనల్ బరిలో నిలిచినా.. ఎదురుగా వరల్డ్ నంబర్ వన్ జొకోవిచ్ ఉన్నా.. నిర్భయంగా ఆడి ఆకట్టుకున్నాడు.

రూ. 12 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ

రూ. 12 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ

క్లే కింగ్ రఫెల్ నదాల్‌కు సెమీస్‌లో చెక్ పెట్టిన టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్.. తుదిపోరులో గ్రీస్ యంగ్ సెన్సేషన్ స్టెఫనోస్ సిట్సిపాస్ విసిరిన చాలెంజ్‌లో నెగ్గాడు. 'గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌' గత అనుభవం అక్కరకొచ్చింది. సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ జొకోవిచ్‌ ఖాతాలో 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేరింది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 4 గంటల 11 నిమిషాల్లో 6-7 (6/8), 2-6, 6-3, 6-2, 6-4తో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై విజయం సాధించాడు. రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. 2016లో తొలిసారి అతను ఈ టైటిల్‌ నెగ్గాడు. విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్‌ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

రెండు సెట్లు చేజారినా..

రెండు సెట్లు చేజారినా..

ఆట మొదలైనప్పటి నుంచే దిగ్గజ ప్రత్యర్థికి ధీటుగా సిట్సిపాస్‌ పోరాడాడు. దీంతో సెర్బియన్‌కు ఫైనల్‌ అంత సులువు కాదని తెలిసిపోయింది. టైబ్రేక్‌కు దారితీసిన తొలి సెట్‌లో సిట్సిపాస్‌ పైచేయి సాధించి 72 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్‌ నెగ్గిన ఆనందంలో సిట్సిపాస్‌ రెట్టించిన ఉత్సాహంతో రెండో సెట్‌ తొలి గేమ్‌లో సెర్బియన్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. తర్వాత టాప్‌ సీడ్‌ ఆటగాడు వరుసగా అనవసర తప్పిదాలు చేయడంతో సిట్సిపాస్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకునేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. రెండో సెట్‌ కూడా సిట్సిపాస్‌ సొంతమైంది.

 తప్పనిసరి పరిస్థితుల్లో

తప్పనిసరి పరిస్థితుల్లో

టైటిల్‌ సాధించాలంటే వరుసగా మూడు సెట్‌లు గెలవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో జొకోవిచ్‌ తన గేరు మార్చి జోరు పెంచాడు. ఒత్తిడిని చిత్తు చేస్తూ.. అలసత్వాన్ని, అనవసర తప్పిదాలకు అక్కడితో చెక్‌ పెట్టాడు. మూడు, నాలుగు సెట్లలో తన సిసలైన పోటీ ఏంటో గ్రీస్‌ ప్రత్యర్థికి ప్రతీ గేమ్‌లోనూ రుచిచూపించాడు. ఇక ఆఖరి సెట్‌ మూడో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన జొకోవిచ్‌ తన సర్వీస్‌లను కాపాడుకొని టైటిల్‌ దిశగా సాగిపోయాడు. సిట్సిపాస్‌ పోరాడినప్పటికీ జొకోను ఓడించేందుకు అది సరిపోలేదు.

జొకోవిచ్ 5 ఎస్‌లు, 3 డబుల్ ఫాల్ట్‌లు, 19 నెట్ పాయింట్స్, 5 బ్రేక్ పాయింట్స్ సాధించగా.. సిట్సిపాస్ 14 ఎస్‌లు, 4 డబుల్ ఫాల్ట్‌లు, 19 నెట్ పాయింట్లు, 3 బ్రేక్ పాయింట్స్ నెగ్గాడు. 56 విన్నర్స్‌తో పాటు 41 సార్లు అనవసర తప్పిదాలు చేసిన జొకో మొత్తం 164 పాయింట్ల ఖాతాలో వేసుకున్నాడు. ఇక 61 విన్సర్స్‌తో పాటు 44 అనవసర తప్పిదాలతో 147 పాయింట్స్ మాత్రమే నెగ్గిన సిట్సిపాస్ మూల్యం చెల్లించుకున్నాడు.

 రికార్డుల మోత..

రికార్డుల మోత..

పురుషుల టెన్నిస్‌లో 'కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌' (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలవడం) ఘనతను రెండుసార్లు చొప్పున నమో దు చేసిన మూడో ప్లేయర్‌ జొకోవిచ్‌. గతంలో రాడ్‌ లేవర్‌ (ఆస్ట్రేలియా-1969), రాయ్‌ ఎమర్సన్‌ (ఆస్ట్రేలియా-1967) మాత్రమే ఈ ఘనత సాధించారు. జొకోవిచ్‌ నెగ్గిన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-9; ఫ్రెంచ్‌ ఓపెన్‌-2; వింబుల్డన్‌-5; యూఎస్‌ ఓపెన్‌-3). ఫెడరర్, రాఫెల్‌ నాదల్‌ (20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచిన ఏడో ప్లేయర్‌ జొకోవిచ్‌. గతంలో బెర్నార్డ్‌ (1946), రాడ్‌ లేవర్‌ (1962), బోర్గ్‌ (1974), లెండిల్‌ (1984), అగస్సీ (1999), గాడియో (2004) ఈ ఘనత సాధించారు.

Story first published: Monday, June 14, 2021, 8:02 [IST]
Other articles published on Jun 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X