ఓ వైపు భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడుతూ దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపుతుంటే.. మరోవైపు భారత జూనియర్ బాక్సింగ్ జట్టుకు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే భారత బాక్సింగ్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా నెలకొన్న లాజిస్టిక్ సమస్యలు భారత క్రీడాకారుల కలలను చిధ్రం చేశాయి.

శాపంగా మారిన పాస్‌పోర్ట్ సమస్య!
మోంటెనెగ్రోలోని బుడ్వా నగరంలో మార్చి 3 నుంచి 11 వరకు జరగాల్సిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మంది సభ్యులతో కూడిన భారత జూనియర్ జట్టు పాల్గొనాల్సి ఉంది. అయితే క్రీడాకారుల పాస్‌పోర్టులు సకాలంలో చేతికి అందకపోవడంతో జట్టు టోర్నీకి వెళ్లలేకపోయింది. వీసా స్టాంపింగ్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి పంపిన పాస్‌పోర్టులు అక్కడే నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

యూఏఈకి పాస్‌పోర్టులు ఎందుకు పంపాల్సి వచ్చింది?
భారత్‌లో మోంటెనెగ్రో ఎంబసీ (దౌత్య కార్యాలయం) లేదు. దీనివల్ల భారత బాక్సింగ్ ఫెడరేషన్ (BFI), యూఏఈలోని మోంటెనెగ్రో ఎంబసీ ద్వారా వీసా దరఖాస్తు చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి 20న వీసా స్టాంపింగ్ కోసం బాక్సర్ల ఒరిజినల్ పాస్‌పోర్టులను అక్కడికి పంపారు. సాధారణంగా 2 నుంచి 3 రోజుల్లో తిరిగి రావాల్సిన పాస్‌పోర్టులు, మధ్యప్రాచ్యంలో హఠాత్తుగా యుద్ధం మొదలవ్వడంతో నిలిచిపోయాయి.

విఫలమైన ప్రయత్నాలు
వీసా అప్రూవల్ గురించి ఈమెయిల్ ద్వారా సమాచారం అందినప్పటికీ.. ఫిజికల్ పాస్‌పోర్టులు లేకుండా ప్రయాణించడం అసాధ్యం. బాక్సింగ్ ఫెడరేషన్ అధికారులు నిరంతరం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA), ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విమాన టిక్కెట్లు కూడా సిద్ధంగా ఉంచినప్పటికీ, పాస్‌పోర్టులు సకాలంలో రాకపోవడంతో టోర్నీ నుంచి భారత్ వైదొలగక తప్పలేదు.
ఆవేదనలో క్రీడాకారులు
ఏడాది పొడవునా కష్టపడి ప్రాక్టీస్ చేసిన యువ బాక్సర్లు, ఇలాంటి ఊహించని రాజకీయ కారణాల వల్ల వరల్డ్ కప్ ఆడే అవకాశం కోల్పోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. యుద్ధం కేవలం రాజకీయాలనే కాదు, ఎంతో మంది క్రీడాకారుల కెరీర్‌ను కూడా ఎలా ప్రభావితం చేస్తుందో అనడానికి ఈ ఘటనే నిదర్శనం. భారత బాక్సర్ల వరల్డ్ కప్ కల యుద్ధ మేఘాల మధ్య చిక్కుకుపోయింది. క్రీడాకారులు తమ తప్పు లేకుండానే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం దురదృష్టకరం.