న్యూయార్క్: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్( డబ్ల్యూడబ్ల్యూఈ) క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. లూక్ హార్పర్, బ్రాడి లీగా పేరొందిన అమెరికా ప్రొఫెషనల్ రెజ్లర్ జొనాథన్ హుబర్ అనారోగ్యంతో మరణించారు. శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న జోనాథన్.. శనివారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఇక జోనాథన్ అకాల మరణం పట్ల రెజ్లింగ్ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువు స్టార్ రెజ్లర్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
''జోనాథన్ హుబెర్ మరణం విషాదానికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం'' అని డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్ చేసింది. ర్యాండీ ఓర్టన్, షేమస్, ట్రిపుల్ హెచ్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్లు హార్పర్ మృతికి ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.
1979లో న్యూయార్క్‌లో జన్మించిన హ్యూబర్ రెజ్లర్‌గా 1990లో తన కెరీర్ ప్రారంభించారు. 2003లో రోచెస్టర్ ప్రోరెజ్లింగ్‌లో బ్రోడై లీ పేరుతో రింగ్‌లోకి దిగారు. 1995లో కెవిన్ స్మిత్ సినిమా మాల్‌రాట్స్‌లో ఓ పాత్ర పోషించారు. ఆల్ ఎలైట్ రెజ్లింగ్‌లో బ్రాడ్ లీగా గుర్తింపు పొందిన జోనాథన్‌కు ఓవరాల్‌గా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉంది. అభిమానులంతా అతన్ని బిగ్ మ్యాన్‌గా పిలుచుకునేవారు. 6 అడుగుల 5 అంగుల పొడవు, 275 పౌండ్ల బరువుతో ఆజాను బాహుడిగా కనిపించేవాడు. గుబురు గడ్డం, మీసంతో కనిపించే హర్పర్.. ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ను రెండు సార్లు గెలిచిన హుబర్, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.
ఏఈడబ్ల్యూలో చేరిన తర్వాత ఏఈడబ్ల్యూ టీఎన్‌టీ చాంపియన్‌షిప్ గెలిచాడు. 2012 డబ్ల్యూ డబ్ల్యూఈలో అడుగుపెట్టిన జోనాథన్.. ఫ్లొరిడా చాంపియన్ షిప్, ఎన్‌ఎక్స్‌టీ ట్యాగ్ టీమ్ చాంపియన్ షిప్‌లను గెలచుకున్నాడు. 2019 డిసెంబర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈని వదిలిన జోనాథన్.. మార్చిలో ఏఈడబ్ల్యూలో అరంగేట్రం చేశాడు. ఆగస్టులో ఏఈడబ్ల్యూ టీఎన్‌టీ చాంపియన్ షిప్ కూడా నెగ్గాడు.
జోనాథన్ మరణంపై అనేక వార్తలు ప్రచారంలోకి రాగా.. ఆయన సతీమణి అమందా హుబర్ ఇన్‌స్టా వేదికగా స్పందించారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మరణించారని, తన భర్తకు కరోనా సొకలేదని స్పష్టం చేశారు. ఇలా రాయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, తన భర్త అకాల మరణంతో తన గుండెపగిలిందని భావోద్వేగానికి గురయ్యారు.