అవకాశం వచ్చినప్పుడల్లా భారత్‌పై అక్కసు వెళ్లగక్కే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు. అహ్మదాబాద్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ మెగా ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడిన మైఖేల్ వాన్.. టీమిండియా హాట్ ఫేవరేట్ అయినప్పటికీ.. ఆ జట్టు నుంచి ఓడించే సత్తా న్యూజిలాండ్‌కు ఉందన్నాడు. అంతేకాకుండా ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా జరగనుండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్. కానీ న్యూజిలాండ్ తాము సెమీఫైనల్లో ఆడిన విధానాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగడం వారికి కలిసొచ్చే అంశం. గతంలో అహ్మదాబాద్‌లోనే భారత్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిందనే విషయాన్ని వారు గుర్తు చేసుకుంటారు. ఆ నాడు ప్యాట్ కమిన్స్ స్టేడియంలోని ప్రేక్షకులను ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంచాడో.. మిచెల్ సాంట్నర్ కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. భారత్‌ను ఓడించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు న్యూజిలాండ్ వద్ద ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతా ఆ రోజు వారు ఆడే తీరుపైనే ఆధారపడి ఉంటుంది.

నా దృష్టిలో భారత్ ఫేవరెట్ అయినప్పటికీ.. న్యూజిలాండ్ గెలిచినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే వారు వైట్-బాల్ క్రికెట్‌లో ఐసీసీ ట్రోఫీ గెలవాల్సిన సమయం ఆసన్నమైంది. వారు అందుకు అర్హులు. గత కొంత కాలంగా న్యూజిలాండ్ అత్యంత నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది.'అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను భారత్ ఇప్పటి వరకు ఓడించలేదు. భారత్‌ను న్యూజిలాండ్ మాత్రం మూడు సార్లు ఓడించింది. 2007, 2016, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను న్యూజిలాండ్ చిత్తు చేసింది. న్యూజిలాండ్ చేతిలో ఓడినా.. 2007 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. గత రికార్డ్ బాలేకున్నా.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మెగా టోర్నీలో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచింది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం సూపర్-8 దశలో తమ చివరి మ్యాచ్‌ను ఓడిపోయింది. కాకపోతే సెమీఫైనల్లో పటిష్టమైన సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్.. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌ను ఓడించి గత చరిత్రను తిరగరాయలని భారత్ భావిస్తోంది. మరోవైపు అభిమానులు కూడా భారత్ గెలవాలని, తద్వారా టీమిండియా వ్యతిరేకుల నోరు మూయించాలని కోరుకుంటున్నారు.