
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఓ యువ రెజ్లర్‌పై చేయిచేసుకున్నారు. కోపాన్ని అదుపులో ఉంచుకోలేక కుర్రాడి చెంప చెళ్లుమనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రతిపక్షాలు, నెటిజన్లు బీజేపీ ఎంపీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించడం బాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. ఝార్ఖండ్‌లో రాంచీ వేదికగా అండర్-15 నేషనల్ రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే.. కొందరు ఎక్కువ వయస్సు ఉన్నాసరే పోటీల్లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. దీంతో నిర్వాహకులు.. దాదాపు 60 నుంచి 70 మందిని పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువ రెజ్లర్ తాను క్వాలిఫై కాలేదనే విషయాన్ని తట్టుకోలేకపోయాడు. శుక్రవారం రెజ్లింగ్ పోటీల చివరిరోజున.. స్టేజ్‌పైన ఉన్న బ్రిజ్ భూషణ్‌తో ఏదో చెప్పబోయేందుకు ప్రయత్నించాడు. దీనికి ఆగ్రహించిన బ్రిజ్ భూషణ్.. యువకుడిని చెంపదెబ్బ కొట్టారు.
ఆ యువ రెజ్లర్ గోండాలోని ఈ బీజేపీ ఎంపీ ట్రైనింగ్ అకాడమీలోనే శిక్షణ పొందాడని ఘటనాంతరం తెలిసింది. అదే విషయం చెప్పే ప్రయత్నం సదరు కుర్ర రెజ్లర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డబ్ల్యూఎఫ్ సెక్రటరీ వినోద్ తోమర్ మీడియాతో మాట్లాడాడు. 'బాధితుడు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు సంబంధించిన కేంద్రంలోనే శిక్షణ పొందాడు. ఈ క్రమంలో అండర్-15 పోటీల్లో పాల్గొనేందుకు సాయం చేయమని కోరేందుకు వచ్చాడు. కానీ, బ్రిజ్.. అందుకు ఒప్పుకోలేదు. అధిక వయస్సుగలవారు అర్హతలేని పోటీల్లో పాల్గొనకుండా చేయడమే లక్ష్యంగా బ్రిజ్ పనిచేస్తున్నారు.'ఆయన చెప్పుకొచ్చారు.
యువ రెజ్లర్.. అధ్యక్షుడు బ్రిజ్‌కు కోపం వచ్చేలా చేశాడని వినోద్ పేర్కొన్నారు. అందుకే అతనిపై బ్రిజ్ చేయిచేసుకున్నారని వివరించారు. 2018 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అండర్-15 రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తోంది. అప్పటినుంచి అర్హతకు మించిన వారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలున్నాయి.