న్యూఢిల్లీ: ఉక్రెయిన్ ఫుట్ బాల్ ప్లేయర్ రోమన్ యెరెమ్‌చుక్‌కు అభిమానుల నుంచి విశేష మద్ధతు లభించింది. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దురాక్రమణను ఖండిస్తూ.. తమ మద్దతు ఉంటుందని అభిమానులు ప్లకార్డులు, చప్పట్లతో ఆ దేశ ఆటగాడికి సంఘీభావం తెలిపారు. స్టేడియంలో అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. పోర్చుగల్‌లో జరిగిన ప్రిమైరా లిగా ఫుట్‌బాల్ లీగ్‌లో బెన్‌ఫికా, విక్టోరియా ఎస్‌సీ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
బెన్‌ఫికా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న యెరెమ్‌చుక్.. ఈ మ్యాచ్‌లో మొదట తుది జట్టులో లేడు. కానీ 62వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. అయితే అతడు మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానులు కరతాళధ్వనులతో స్వాగతం పలుకుతూ అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు మద్ధతు తెలుపుతూ.. ప్లకార్లులు ప్రదర్శించారు. సంఘీభావం ప్రదర్శిస్తూ.. డిఫెండర్ జాన్ వెర్టోంగ్‌హెన్ కెప్టెన్ ఆర్మ్ బ్యాండ్‌ను రోమన్ చేతికి తొడిగాడు.
🇺🇦 This moment... Speachless! 🙌 pic.twitter.com/EpgNydnZer
— SL Benfica (@slbenfica_en) February 27, 2022
దీంతో ప్రస్తుతం తన దేశంలోని పరిస్థితులను తలుచుకున్న యెరెమ్‌చుక్ భావోద్వేగానికి గురయ్యాడు. అభిమానులకు అభివాదం చేస్తూ కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బెన్‌ఫికా జట్టు ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో బెన్‌ఫికా జట్టు 3-0 గోల్స్ తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది.
సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దురాక్రమణ ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఇరువైపుల వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోగా.. దాడుల్లో ఉక్రెయిన్ సామాన్య పౌరులు కూడా చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు ఐరోపా సమాఖ్యలో తక్షణమే సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఈయూకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక విధానం ద్వారా అది సాధ్యమేనన్నారు. మరోవైపు ఆయుధాలను వీడి వెనక్కి వెళ్లిపోవాలని.. తద్వారా రష్యా సైనికులు తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు ప్రారంభమయ్యే ముందు జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
'కొత్తగా ప్రత్యేక విధానంలో ఉక్రెయిన్‌ను ఐరోపా సమాఖ్యలో తక్షణమే చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అది సాధ్యమే' అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అందరు యూరోపియన్లతో కలిసి ఉండడమే తమ లక్ష్యమన్న ఆయన.. ఇది సరైన విధానం, తప్పకుండా సాధ్యమైన అంశమేనన్నారు. రష్యా చేస్తోన్న దాడుల్లో ఇప్పటివరకు 16మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో 45 మంది తీవ్రంగా గాయపడినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. వారందరినీ ఉక్రెయిన్ హీరోలుగా ఆయన అభివర్ణించారు.