
నువ్వా-నేనా అన్నట్లు..
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరుజట్లూ దీటుగానే తలపడ్డాయి. అయితే, బంతిపై ఆధిపత్యంలో క్రొయేషియా కొంత పైచేయి సాధించినా.. ప్రత్యర్థి గోల్‌పోస్టుపై జపాన్ కలవరపెట్టగలిగే దాడులు చేసింది. మూడో నిమిషంలోనే ఆసియా జట్టుకు సువర్ణావకాశం లభించినా.. షోగో తనిగుచి కొట్టిన హెడర్ గురి తప్పింది.
ఆ తర్వాత క్రొయేషియా క్రమంగా దాడుల ఉధృతిని పెంచి.. జపాన్ డిఫెన్స్ విభాగాన్ని ఒత్తిడికి గురి చేసింది. ఫస్టాఫ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా.. ప్రతిష్టంభనను జపాన్ బద్దలు కొట్టింది. 43వ నిమిషంలో షార్ట్ కార్నర్ కిక్‌ను అందుకొన్న డోయన్ సంధించిన క్రాస్‌ను యోషిడా తలతో కొట్టగా.. బంతిని క్లియర్ చేయడంలో కొంత గందరగోళం నెలకొంది. అయితే, పొంచి ఉన్న మయేడా మెరుపు వేగంతో స్పందించి.. పవర్‌ఫుల్ కిక్‌తో బంతి గోల్‌లోకి పంపాడు. సమీక్షించిన తర్వాత గోల్‌గా ప్రకటించడంతో జపాన్ 1-0 ఆధిక్యంతో బ్రేక్‌కు వెళ్లింది.

సమం చేసిన పెరిసెచ్
సెకండాఫ్‌ను దూకుడుగా ఆరంభించిన క్రొయేషియా.. పది నిమిషాల్లోనే స్కోరు సమం చేసింది. 55వ నిమిషంలో డెజాన్ లోవర్న్ క్రాస్‌ను.. పెరిసెచ్ అద్భుతమైన హెడర్‌తో గోల్‌కి పంపాడు. ప్రతిగా కౌంటర్ ఎటాక్ చేసిన జపాన్ మరో గోల్ చేసినంత పని చేసింది. వాటారు కొట్టిన కిక్‌ను లివకోవిచ్ గాల్లోకి ఎగురుతూ బయటకు నెట్టేశాడు.
ఇది జరిగిన కొద్దిసేపటికి గోండా కూడా సూపర్ సేవ్ చేసి.. క్రొయేషియాకు గోల్ దక్కకుండా చేశాడు. 63వ నిమిషంలో 24 మీటర్ల దూరం నుంచి లూకా మోద్రిచ్ కొట్టిన కిక్.. గోల్ పోస్టు కుడివైపు పైమూలగా దూసుకొస్తుండగా.. గోండా గోల్లోకి ఎగురుతూ పంచ్ ఇచ్చాడు.
నిర్ణీత సమయంలో ఇరుజట్లూ మరో గోల్ సాధించక పోవడంతో.. మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. 105వ నిమిషంలో మిటోమా కొట్టిన కిక్‌ను క్రొయేషియా కీపర్ లివకోవిచ్ సమర్థంగా అడ్డుకోగా.. క్రొయేషియా కూడా సువర్ణాకాశాన్ని చేజార్చుకోడంతో మ్యాచ్ ఫలితం షూటౌట్‌కు దారి తీసింది.

గోల్ కీపర్ అడ్డుకోవడంతో..
షూటౌట్లో తన తొలి రెండు ప్రయత్నాల్లో జపాన్ (మినామినో, మిటోమా) విఫలం కాగా.. క్రొయేషియా (వ్లాసిచ్, బ్రొజోవిచ్) సఫలమైంది. క్రొయేషియా గోల్‌కీపర్ లివకోవిచ్ జపాన్ తొలి రెండు పెనాల్టీను అడ్డుకున్నాడు. క్రొయేషియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో షాట్‌కు జపాన్ (తకూమా) గోల్ చేయగా.. క్రొయేషియా విఫలం (మార్కో) కావడంతో స్కోరు 1-2తో ఆసక్తికరంగా మారింది. కానీ నాలుగో ప్రయత్నంలో యొషిదా (జపాన్) విఫలం కాగా.. పెర్సీచ్ (క్రొయేషియా) గోల్ చేయడంతో క్రొయేషియా సంబరాల్లో మునిగిపోయింది.