టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా తరానికి ఒక్కడు మాత్రమే పుట్టే బౌలర్ అని, అతను ఈ దేశ సంపదని కొనియాడాడాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ముచ్చటగా మూడో టీ20 ప్రపంచకప్‌ను అందుకోవడంతో పాటు వరుసగా రెండో టైటిల్ గెలిచిన జట్టుగా.. సొంతగడ్డపై టైటిల్ అందుకున్న టీమ్‌గా చరిత్ర సృష్టించింది.
ఈ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. విశ్వవిజేతగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. కుర్రాళ్ల అసాధారణ ప్రదర్శనతో ఈ గెలుపు సాధ్యమైందన్నాడు. కెప్టెన్‌గా తన ప్రయాణం ఈ విజయంతో ముగిసిందన్నాడు. 'ఈ గెలుపు పూర్తిగా మనసులోకి వెళ్లడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ చాలా సంతోషంగా ఉన్నాను. ఇది సుదీర్ఘ ప్రయాణం. 2024 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్‌గా నా ప్రయాణం మొదలైంది. జై షా, రోహిత్ భాయ్.. నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రయాణం.. ఈ ప్రపంచకప్ గెలవడంతో ముగిసింది.

గత రెండేళ్లుగా మేం మంచి క్రికెట్ ఆడాం. 2024 ప్రపంచకప్‌లో అనుసరించిన మంచి అలవాట్లనే కొనసాగించాలని అనుకున్నాం. కుర్రాళ్ళు దాన్ని అద్భుతంగా స్వీకరించారు. ఆటగాళ్ల సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారిలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారని నాకు తెలుసు. సమయం ఖచ్చితంగా సరిపోయింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అగ్రశ్రేణి ఆటగాళ్లు. వారు ఏదో ఒక ప్రత్యేకత చేస్తారనే నమ్మకం మాకు ఉంది. సరిగ్గా ఫైనల్లోనే వారు అది చేసి చూపించారు. ఇక బుమ్రా విషయానికి వస్తే.. అతను తరానికి ఒక్కడు మాత్రమే పుట్టే బౌలర్. అతన్ని నేను 'దేశ సంపద' అని పిలుస్తాను. విజయాన్ని ఎలా పూర్తి చేయాలో అతనికి బాగా తెలుసు. ఈ రంగంలో అతనే అత్యుత్తమ ఆటగాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్-3 బ్యాటర్లు సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52), ఇషాన్ కిషన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్(3/46) మూడు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీసారు.
అనంతరం న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది. టీమ్ సీఫెర్ట్(26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ సాంట్నర్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(4/15) నాలుగు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(3/27) మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసారు. భారత బౌలర్ల ధాటికి ఈ మ్యాచ్ ఏక పక్షంగా ముగిసింది.