హైదరాబాద్: బ్రెజిల్ ఫార్వార్డ్ ప్లేయర్ రిచర్లిసన్ పేరు యావత్ ప్రపంచం మారమోగుతోంది. ఒక్క ఖతర్నాక్ బైసికల్ కిక్‌తో ఈ యువ ప్లేయర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంతలా అంటే అసలు ఫుట్‌బాల్‌లో ఏబీసీడీ కూడా తెలియని వారు కూడా అతని గురించి మాట్లాడుకునేంత ఫేమస్ అయ్యాడు. స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ గాయంతో జట్టుకు దూరమవడంతో బ్రెజిల్‌కు ఘోర పరాభావం తప్పదని భావిస్తున్న పరిస్థితుల్లో రిచర్లిసన్ 9 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి ఫుట్‌బాల్ నయా హీరోగా అవతరించాడు. ఈ రెండు గోల్స్‌లో అతను కొట్టిన బైసికల్ కిక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ ఒక్క గోల్‌తో రిచర్లిసన్ ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రోనాల్డో, లియోనల్ మెస్సీ, నెయ్‌మార్ సరస చేరాడంటే అతిశయోక్తి కాదు. ఇక రిచర్లిసన్ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకునేందుకు అభిమానులు గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. అయితే అతను కూడా అందరి దిగ్గజ ఆటగాళ్లలా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ స్థాయికి చేరుకున్నాడు. చుట్టూ నేర ప్రవృత్తి ఉన్న మనుషులు.. ఏ క్షణంలో ఏ గన్ పేలుతుందో అన్న భయం.. ఒకవైపు మాదకద్రవ్యాల స్మగ్లింగ్! ఇలాంటి పరిస్థితుల నుంచి ఓ ఛాంపియన్ చార్లిసన్ దూసుకొచ్చాడు.
On the biggest night of his career, Richarlison turned opportunity into greatness.
— FIFA World Cup (@FIFAWorldCup) November 25, 2022
Can Brazil’s number 9 fire his way to the Golden Boot in Qatar?
🇧🇷 #BRASER 🇷🇸 #POTM #YoursToTake @Budweiser @Budfootball pic.twitter.com/TYCYXUSQz0
సెర్బియాతో మ్యాచ్‌లో అసాధారణ కిక్‌తో మెరుపు గోల్ చేసి అందర్ని ఆకర్షించిన రిచర్లిసన్‌ది చాలా భిన్నమైన నేపథ్యం. బ్రెజిల్‌లోని నోవా వెనిసియా అనే మురికివాడలో పేద కుటుంబంలో పుట్టిన అతడు ఎదిగే క్రమంలో పడని కష్టాల్లేవు. అతని తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. తల్లి కూడా చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. రిచర్లిసన్ చుట్టూ వాతావరణం మాత్రం చాలా ప్రమాదకరంగా ఉండేది. అతడి స్నేహితుల్లో ఎక్కువమంది స్మగ్లర్లే. కానీ రిచర్లీసన్ మాత్రం తల్లికి సాయం చేయడానికి ఐస్ క్రీములు, చాక్లెట్లు అమ్మేవాడు. కార్లు కడిగేవాడు.
ఒకసారి డ్రగ్స్ ఎత్తుకెళ్లడని భావించి ఓ స్మగ్లర్ రిచర్లిసన్ కణతకు తుపాకీ గురిపెట్టాడు. ఆ క్షణంలో ప్రాణాలు పోయినట్లే అనిపించినా కొద్దిలో తప్పించుకున్నాడు. తన తనయుడు డ్రగ్స్ వలలో చిక్కుకోకూడదని రిచర్లిసన్ తండ్రి అతన్ని ఫుట్‌బాల్‌వైపు నడిపించాడు. అదే అతని జీవితాన్ని మార్చింది. వీధుల్లో ఫుట్‌బాల్ ఆడే అతన్ని చూసి ఓ వ్యాపారవేత్త మెనిరో క్లబ్‌లో చేర్పించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన అతడిని 60 మిలియన్ పౌండ్లు వెచ్చించి టొటొన్‌హమ్ దక్కించుంది. ఈ స్ట్రైకర్.. బ్రెజిల్ తరఫున ఇప్పటిదాకా 39 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 19 గోల్స్ కొట్టాడు.