అహ్మదాబాద్: గాయంతో భారత జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాడు. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి జడేజా సతీమణి రివాబా జడేజా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమెకు మద్దతుగా జడేజా నియోజవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. తన సతీమణిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నాడు. శనివారం జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గంలో జడేజా తన సతమణితో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడు. 6 ర్యాలీల్లో పాల్గొని బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే రవీంద్ర జడేజా సోదరి నైనా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఈ వదినా-మరదళ్ల పోటా పోటీ ప్రచారం జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మరింత పెంచింది. ఇద్దరూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను వాడుకుంటోందని వదిన రివాబా జడేజాపై నైనా మండిపడ్డారు. చిన్న పిల్లలతో కూడా ప్రచారం చేయిస్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నైనా పార్టీ టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ హైమాండ్ మాత్రం బిపింద్ర సిన్హ్ జడేజా వైపే మొగ్గు చూపారు. ఆయన గెలుపు కోసం నైనా తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ભારત દેશ નુ અને જામનગર શહેર નુ ગૌરવ જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી દેશ નું અને જામનગર નું ગૌરવ વધારેલ તેવા ઓલ રાઉન્ડર ક્રિકેટર શ્રી @imjadeja નો ભવ્ય રોડ શો. 1/1 pic.twitter.com/XVFEXYkBHq
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) November 24, 2022
ఇక 1990లో జన్మంచిన రివాబా జడేజా.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా.. కాంగ్రెస్‌కు చెందిన హరి సింగ్ సోలంకి మేనకోడలు. 2016లో రవీంద్ర జడేజాను పెళ్లిచేసుకున్న రివాబా జడేజా.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల విలువ రూ.97 కోట్లుగా పేర్కొన్నారు.
ఆసియా కప్‌లో ఆడుతున్న సమయంలోనే రవీంద్ర జడేజా మోకాలి గాయం తిరగబెట్టింది. దీంతో బౌలింగ్ చేయడం కూడా కష్టంగా మారడంతో అతను ఆసియా కప్ మధ్యలోనే జట్టును వీడి ఆస్పత్రికి వెళ్లాడు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ కారణంగానే అతను టీ20 వరల్డ్ కప్, న్యూజిల్యాండ్ పర్యటనలకు దూరంగా ఉన్నాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో అతనుల లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే బంగ్లా పర్యటన సమయానికి జడ్డూ కూడా పూర్తిగా కోలుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ గాయం ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో ఈ పర్యటనకు కూడా దూరంగా ఉంటాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.