ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పట్లో ఐపీఎల్‌ను వదిలేసే సూచనలు కనిపించడం లేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ సీజన్‌లో అతను ఆడుతున్న తీరు చూస్తుంటే.. వచ్చే సీజన్‌లో కూడా ఆడాలనే ఆశ అతని ఉన్నట్లు అర్థమవుతుందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా తప్పుకుంది. ఈ నేపథ్యంలోనే ధోనీ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ధోనీ భవితవ్యంపై మాట్లాడిన గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సీజన్‌లో ధోనీ ఆడిన విధానం చూస్తే అతనికి ఇంకా ఆడాలనే ఇష్టం బలంగా ఉందనిపిస్తోంది. వికెట్ల మధ్య అతను పరుగెత్తుతున్న విధానం చూస్తే ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల చెన్నై ఆడేటప్పుడు రెండు, మూడు వికెట్లు పడగానే.. అతనికి ఆడే అవకాశం వచ్చిందనే విషయాన్ని గుర్తించాడు. పలు సందర్భాల్లో మనం ఈ విషయాన్ని గమనించాం. దీనిని బట్టి చూస్తే ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతాడని తెలుస్తోంది. 2020 సీజన్‌లో చెన్నై ఆఖరి మ్యాచ్ పూర్తయ్యాక.. అతను ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడా? అని అడిగినప్పుడు కూడా కచ్చితంగా కాదనే సమాధానం చెప్పాడు' అని గవాస్కర్ గుర్తు చేశాడు.
ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా వచ్చే ఏడాది చెన్నై జట్టులో ఆడతారా లేదా అని అడిగిన ప్రశ్నకు ధోనీ తెలివిగా సమాధానమిచ్చాడు. కచ్చితంగా మీరు నన్ను పసుపు రంగు జెర్సీలో చూస్తారు. కానీ, అది ఆటగాడిగానా లేక ఇతర పాత్రలోనా అనేది వేరే విషయం అని బదులిచ్చాడు. మరోవైపు మాథ్యూ హేడెన్, షోయబ్ అక్తర్ లాంటి దిగ్గజాలు కూడా ధోనీ ఆడాలనుకుంటే వచ్చే సీజన్‌లో కొనసాగవచ్చని అన్నారు.