పాకిస్థాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అండగా నిలిచాడు. సల్మాన్ అలీ అఘా రనౌటైన తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్దమని పేర్కొన్నాడు. ప్రపంచకప్ ఫైనల్లో కూడా విజయం కోసం ఇలాంటి ఆట ఆడవద్దని యువ క్రికెటర్లకు సూచించాడు.
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో సల్మాన్ అలీ అఘా రనౌట్ అయిన తీరు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. మహమ్మద్ రిజ్వాన్(44)తో కలిసి సల్మాన్ అలీ ఆఘా (64) నాలుగో వికెట్‌కు 109 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే బంగ్లా కెప్టెన్ మెహ్‌దీ హసన్ మిరాజ్ వేసిన 39వ ఓవర్‌లో మహమ్మద్ రిజ్వాన్ బౌలర్‌వైపు షాట్ ఆడాడు. బంతి కాస్త నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న సల్మాన్ అలీ అఘా బ్యాట్‌కు తాకింది. దాంతో ఆ బంతిని సల్మాన్ అలీ అఘా బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు.

కానీ మెహ్‌దీ హసన్ మిరాజ్ వేగంగా బంతిని అందుకొని నాన్‌స్ట్రైకర్ వికెట్లను కొట్టి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. దాంతో సల్మాన్ అఘా అవాక్కయ్యాడు. బంతిని అందించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలనుకున్న అతనికి ఈ అనూహ్య ఘటన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా బ్యాటర్ క్రీజు బయటే ఉన్నాడని ఔటిచ్చాడు.
దాంతో తీవ్ర అసహనానికి గురైన సల్మాన్ అఘా.. బంగ్లా ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. పెవిలియన్ చేరుతూ బ్యాట్, గ్లౌజులను నేలకు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

బంగ్లాదేశ్ చర్యను తప్పుబడుతూ మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. 'ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వికెట్లు తీయాలనే ఏ ఆరాటం కూడా ఈ రనౌట్‌ను సమర్థించలేదు. అది కూడా ఒక కెప్టెన్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేం. యువ క్రీడాకారులారా ఒకటి గుర్తుంచుకోండి.. చివరికి ప్రపంచకప్ ఫైనల్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ కెప్టెన్ చేసిన పనిని మాత్రం ఎప్పుడూ చేయకండి. క్రీడా స్ఫూర్తి లేని ఆట అసలైన ఆట అనిపించుకోదు.'అని కైఫ్ పేర్కొన్నాడు.