ప్రస్తుత క్రికెట్‌లో క్రీడా స్ఫూర్తి చచ్చిపోయిందని పాకిస్థాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. నిబంధనల ప్రకారం తాను ఔటైనా.. క్రీడా స్ఫూర్తి కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో సల్మాన్ అలీ అఘా రనౌట్ అయిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. మహమ్మద్ రిజ్వాన్(44)తో కలిసి సల్మాన్ అలీ ఆఘా (64) నాలుగో వికెట్‌కు 109 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే హసన్ మిరాజ్ వేసిన 39వ ఓవర్‌లో మహమ్మద్ రిజ్వాన్ బౌలర్‌వైపు ఆడాడు. అది కాస్త నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న సల్మాన్ అలీ అఘా బ్యాట్‌కు తాకింది. దాంతో ఆ బంతిని సల్మాన్ అలీ అఘా బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు.

అయితే సల్మాన్ అలీ అఘా క్రీజు దాటి ఉన్న విషయాన్ని గ్రహించిన హసన్ మిరాజ్.. బంతిని అందుకొని వికెట్లకు కొట్టి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. దాంతో సల్మాన్ అఘా అవాక్కయ్యాడు. బంతిని అందించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలనుకున్న అతనికి ఈ అనూహ్య ఘటన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా బ్యాటర్ క్రీజు బయటే ఉన్నాడని ఔటిచ్చాడు.
దాంతో తీవ్ర అసహనానికి గురైన సల్మాన్ అఘా.. బంగ్లా ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. పెవిలియన్ చేరుతూ బ్యాట్, గ్లౌజులను నేలకు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన సల్మాన్ అఘా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలనుకున్నాను. హసన్ మిరాజ్ నిబంధనల ప్రకారమే చేశాడు. అది సరైనదని అతను భావిస్తే.. సరైనదే కావచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం అది తప్పు. నేనైతే క్రీడా స్ఫూర్తికే ప్రాధాన్యత ఇచ్చేవాడిని. మేం గతంలో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. భవిష్యత్తులో కూడా చేయం.
వాస్తవానికి బంతి నా ప్యాడ్‌తో పాటు బ్యాట్‌కు తగిలింది. దాంతో అతను రౌట్ చేయడని నేను భావించా. అందుకే బంతిని అతనికి అందించే ప్రయత్నం చేశాను. నేను పరుగు కోసం ప్రయత్నించలేదు. కానీ అతను అప్పటికే రనౌట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆ సమయంలో లిటన్ దాస్‌తో జరిగిన వాగ్వాదం క్షణికావేశంలో జరిగినది. అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపపడుతున్నాను.
ఆ సమయంలో నేను ఏమన్నానో.. అతను ఏమన్నాడో నాకు గుర్తు లేదు. మా నోటి నుంచి అయితే మంచి మాటలు రాలేదు. కానీ అది కేవలం ఆ క్షణపు ఆవేశం మాత్రమే. ఇప్పుడు అంతా బానే ఉంది. హసన్ మిరాజ్‌తో ఇంకా మాట్లాడలేదు. కానీ త్వరలోనే కలిసి మాట్లాడుతాను.'అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.