|
పాక్ వెళ్లేందుకు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే విషయం తమ చేతుల్లో లేదని, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు తాము నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వాన్ని కాదని బీసీసీఐ ఏం చేయలేదని నయా ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కూడా తెలిపాడు. బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం టీమిండియా.. పాకిస్థాన్‌లో అడుగుపెట్టదని, అసలు ఆసియాకప్ 2023 పాకిస్థాన్‌లోనే జరగదన్నాడు. తాత్కలిక వేదికగా ఈ టోర్నీ జరుగుతుందని పేర్కొన్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షానే కావడంతో ఈ వ్యాఖ్యలకు ప్రాధానత్య సంతరించుకుంది.
|
ఎవరికీ భయపడం..
తాజాగా ఈ వ్యవహరంపై స్పందించిన రమీజ్ రాజా.. బిలియన్ డాలర్ టీమ్‌ను ఏడాది కాలంలో రెండు సార్లు ఓడించామని చెప్పాడు. 'ఆసియా కప్ 2023 టోర్నీ కోసం భారత జట్టు, పాకిస్థాన్‌కు రాకపోతే మేం ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనం. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. భారత జట్టు, ఇక్కడికి వస్తే, మేం అక్కడికి వెళ్తాం. వాళ్లు రాకపోతే మేం లేకుండానే వరల్డ్ కప్ జరుపుకోవచ్చు... పాక్ క్రికెట్ బోర్డు ఎవ్వరికీ భయపడదు. పాకిస్తాన్ క్రికెట్ ఎకానమీని బాగుచేయాల్సిన బాధ్యత పీసీబీపైన ఉంది.
|
రెండుసార్లు ఓడించాం..
2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాని ఓడించడం... ఆసియా కప్ 2022 టోర్నీలో కూడా భారత జట్టును చిత్తు చేశాం. ఒకే ఏడాది గ్యాప్‌లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్, బిలియన్ డాలర్ ఎకానమీ టీమ్‌ని రెండు సార్లు ఓడించింది. పాక్ పటిష్టంగా మారిందని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది. పాక్ జట్టు పాల్గొనని వన్డే ప్రపంచకప్‌ను ఎవరు చూడరు.'అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. అయితే రమీజ్ రాజా వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ రెండు సార్లు ఓడించినప్పటికీ.. టీమిండియా కూడా రెండు సార్లు గెలిచిందనే విషయం మరిచిపోవద్దని హితవు పలుకుతున్నారు. వాపును చూసి బలుపు అనుకుంటే ఎలా రాజా? అని ప్రశ్నిస్తున్నారు. జింబాబ్వేతో భారత్ ఆడినా జనాలు ఎగబడతారని కామెంట్ చేస్తున్నారు.
|
పాక్‌కు నష్టమే..
భారత జట్టు, పాకిస్థాన్‌కు వెళ్లకపోతే ఆసియా కప్ 2023 టోర్నీకి క్రేజ్ పూర్తిగా పోతుంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే పాకిస్థాన్, వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌కు రాకపోతే కూడా పీసీబీకే నష్టం జరుగుతుంది. ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా వచ్చే కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా వచ్చే భారీ ఆదాయం, బీసీసీఐ కోల్పోవాల్సి ఉంటుంది.