ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన భారత జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కనక వర్షం కురిపించింది. ఏకంగా రూ. 131 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. భారత క్రీడా చరిత్రలోనే అత్యధిక రివార్డ్ ఇది. గతంలో కంటే రూ.6 కోట్లు ఎక్కువగా నజరానా ప్రకటించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన రోహిత్ సేనకు బీసీసీఐ రూ. 125 కోట్ల క్యాష్ ప్రైజ్ అందజేసింది. అప్పుడు జట్టు మెంబర్స్ తలో రూ.5 కోట్లు తీసుకోగా.. రిజర్వ్ ప్లేయర్లకు రూ. 1 కోటి చొప్పున క్యాష్ ప్రైజ్ దక్కింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగులతో చిత్తు చేసిన టీమిండియా వరుసగా రెండో టైటిల్ గెలవడంతో పాటు మూడో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. దాంతో సూర్యసేనకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ రివార్డ్ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనను విడదలు చేసింది.

'ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో సాధించిన ఘనవిజయానికి గుర్తుగా.. భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ రూ. 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ విజయంతో టీమిండి తన టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా, మూడుసార్లు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా కూడా అవతరించింది. ఈ ఫార్మాట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని, సెలెక్టర్లను బోర్డు మరోసారి అభినందిస్తూ.. భవిష్యత్తులో కూడా వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.'అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
రూ. 131 కోట్ల భారీ క్యాష్ రివార్డ్‌లో ఎవరికి ఎంత? అనే వివరాలను బీసీసీఐ వెల్లడించలేదు. జట్టులోని 15 మంది సభ్యులకు రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల చొప్పున లభించే అవకాశం ఉంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు కూడా ప్లేయర్లతో సమంగా క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఫిజియోలు, ట్రైనర్లు, మసాజర్లు, ఇతర సహాయక సిబ్బందికి వారి హోదాను బట్టి రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు లభించవచ్చు. జట్టును ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ సభ్యులకు కూడా కోటి చొప్పున నగదు పురస్కారం దక్కవచ్చు.