జస్ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ వణుకు పుట్టించిందని, తన హార్ట్‌బీట్ అమాంతం పెరిగిపోయిందన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీఫైనల్ దూసుకెళ్లింది.
254 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు టీమిండియా ఆపసోపాలు పడాల్సి వచ్చింది. జాకోబ్ బెతెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 ) విధ్వంసకర శతకంతో టీమిండియాను వణికించాడు. జస్‌ప్రీత్ బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేసి చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. ఇరు జట్ల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం కూడా బుమ్రానే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. బుమ్రాను ప్రత్యేకంగా కొనియాడాడు. సంజూ శాంసన్ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు. సొంతగడ్డపై ప్రపంచకప్ ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

'ఇదొక నమ్మశక్యం కాని అనుభూతి. భారత్‌లో ఆడుతూ.. ఇంతటి గొప్ప జట్టుకు నాయకత్వం వహించడం.. వరల్డ్ కప్ ఫైనల్ చేరడం చాలా ప్రత్యేకం. మా ఆటగాళ్లందరికీ ఇదొక స్పెషల్ ఫీలింగ్. స్పష్టమైన అవగాహనతో సంజూ శాంసన్ బ్యాటింగ్ చేశాడు. వికెట్ పడినా సరే.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని గ్రహించి దూకుడుగా ఆడాడు. జట్టుకు సరిగ్గా అలాంటి ఇన్నింగ్సే అవసరం. గత ఏడాది కాలంగా తను పడుతున్న కష్టానికి ఈరోజు తగిన ప్రతిఫలం దక్కింది. అతనిది ప్రత్యేకమైన నాక్.

ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసిన తీరును చూసి.. 'ఓ మై గాడ్! మీపై గెలవాలంటే మేం ఇంకెన్ని పరుగులు చేయాలి?' అని హ్యారీ బ్రూక్‌తో అన్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆఖరి వరకు వారు మ్యాచ్‌లోనే ఉన్నారు. కానీ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ఇతర బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను మావైపు తిప్పారు. బుమ్రా సామర్థ్యం ఏంటో.. ఇన్నేళ్లుగా భారత్ కోసం తను ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ అదే చేశాడు. బాధ్యత తీసుకుని మ్యాచ్‌ను ఇంగ్లండ్ నుంచి లాగేసుకున్నాడు.

మా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ప్రాక్టీస్ సెషన్లను సరదాగా.. పోటీతత్వంతో ఉండేలా చూస్తూ ఆయన చేస్తున్న కృషికి కుర్రాళ్లు బాగా స్పందిస్తున్నారు. అది మైదానంలో కనిపిస్తోంది. మా జట్టులో నంబర్ 3 వరకు అన్నీ సెటిల్ అయి ఉన్నాయి. కానీ రషీద్ బౌలింగ్ చేస్తున్నప్పుడు దూబేను అప్‌ది ఆర్డర్ పంపించడం కరెక్ట్ అనిపించింది. ఒకవేళ నేను గత మ్యాచ్‌లో 50, 100 పరుగులు చేసినా సరే.. జట్టు కోసం దూబేను ముందుకు పంపించేవాడిని.
ఇంగ్లండ్ లక్ష్య ఛేదనలో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో ఎవరైనా నా హార్ట్ రేట్ చూసి ఉంటే అది ఖచ్చితంగా 160-175 మధ్యలో ఉండేది. కానీ అది ఆటలో భాగం. ఇదొక అద్భుతమైన సెమీ ఫైనల్. ఇప్పుడు ఫైనల్‌కు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేం వార్మప్ కోసం వచ్చినప్పుడే స్టేడియం ప్రేక్షకులతో 75-80 శాతం నిండిపోయింది. భారత్ గెలవాలని వారు ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది. ఫైనల్ ముందు వారికి ఒక గొప్ప ఆటను అందించామని అనుకుంటున్నా. భారత్‌లో ఫైనల్ ఆడటం ఖచ్చితంగా ఒత్తిడిని కలిగిస్తోంది. కానీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.