టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్‌ను బంతి కొట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
'ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1ను అర్ష్‌దీప్ సింగ్ ఉల్లంఘించాడు. దాంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించాం. అంతేకాకుండా ఆటగాడిపై ప్రమాదకరమైన రీతిలో బంతి విసిరి ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.9ని ఉల్లంఘించాడు. దాంతో అర్ష్‌దీప్ సింగ్‌కు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించాం. గత 24 నెలల కాలంలో అతను ఇలాంటి తప్పు చేయడం ఇదే తొలిసారి.

న్యూజిలాండ్ బ్యాటింగ్ సందర్భంగా 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ష్‌దీప్ తన ఫాలో-త్రూలో బంతిని అందుకొని డారిల్ మిచెల్‌పై విసిరాడు. ఆ బంతి మిచెల్ ప్యాడ్స్‌కు తగిలింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు తన తప్పిదాన్ని అంగీకరించిన అర్ష్‌దీప్ సింగ్.. శిక్షకు అంగీకరించాడు. దాంతో అధికారిక విచారణ లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్, థర్డ్ అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్, ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ ఫిర్యాదుతో మ్యాచ్ రిఫరీ విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. లెవల్ 1 ఉల్లంఘనలకు కనీస శిక్షగా అధికారిక మందలింపు, గరిష్ట శిక్షగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధిస్తారు.'అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటన సమయంలో ఫీల్డ్ అంపైర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మందలించగా.. ఓవర్ పూర్తయిన అనంతరం అర్ష్‌దీప్ సింగ్ డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఘటన సమయంలోనే మిచెల్‌కు సారీ చెప్పి గొడవ సద్దుమణిగేలా చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం డారిల్ మిచెల్‌కు మరోసారి క్షమాపణలు చెప్పిన అర్ష్‌దీప్ సింగ్.. అతన్ని హగ్ చేసుకొని మరీ రీల్ చేశాడు.
బ్రాడ్ కాస్టర్‌తో కూడా ఉద్దేశపూర్వకంగా బంతిని విసరలేదని, బంతి స్వింగ్ అయ్యి మిచెల్‌కు తాకిందని అర్ష్‌దీప్ సింగ్ వివరణ ఇచ్చాడు. డారిల్ మిచెల్‌కు క్షమాపణలు కూడా చెప్పానని వెల్లడించాడు. భారత ఆటగాళ్లకు ఒక్క టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షల మ్యాచ్ ఫీజు అందుతుంది. ఈ లెక్కన అర్ష్‌దీప్ సింగ్ మ్యాచ్ ఫీజులో రూ. 45 వేలు కోత పడనుంది. ఇది అతని పెద్ద లెక్క కాదు. కానీ మరో 24 నెలల వ్యవధిలో మరో 3 డీమెరిట్ పాయింట్స్ వస్తే అర్ష్‌దీప్ సింగ్‌పై ఓ టెస్ట్ మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం పడుతుంది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్స్ రావద్దు.