|
రూ.43 వేల కోట్ల దగ్గర ఆగిన వేలం..
ఆదివారం మధ్యాహ్నం ముంబైలో ఈ-వేలం ప్రారంభమైంది. నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ముందుగా ఎ (ఉపఖండంలో టీవీ హక్కులు) బి (డిజిటల్ హక్కులు) విభాగాలకు వేలం నిర్వహిస్తున్నారు. టీవీ ప్రసారం హక్కుల కోసం ఒక్కో మ్యాచ్‌కు బీసీసీఐ రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఇది రూ. 100 కోట్ల మార్కు దాటిందని తెలుస్తున్నది. క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ సమచారం ప్రకారం తొలి రోజు వేలం ముగిసే సమయానికి ఒక్కో మ్యాచ్ విలువ రూ. 104 కోట్లు ధాటింది. సోమవారం ఉదయం మళ్లీ 11 గంటలకు ఈవేలం ప్రారంభం కానుంది. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రూ.43 వేల కోట్ల దగ్గర ఆగినట్లు తెలుస్తోంది.
|
మంగళవారం ముగిసే చాన్స్..
ఈ వేలానికి ప్రత్యేకంగా ముగింపు తేదీని ప్రకటించలేదు. కానీ సోమవారం లేదా మంగళవారం ఇది ముగిసే అవకాశం ఉంది. మిగతా సంస్థలన్నీ పక్కకు తప్పుకుని, అత్యధిక బిడ్ దాఖలయ్యే వరకూ ఈ వేలం కొనసాగుతుంది. ఆన్‌లైన్ పోర్టల్‌లో సంస్థలు తమ బిడ్లు దాఖలు చేస్తాయి. ఒక్కొక్క సంస్థ వేలం నుంచి తప్పుకుంటూ చివరకు ఒక్కటి మాత్రమే మిగిలేంత వరకూ వేలం జరుగుతుంది. సంస్థలు వేసిన బిడ్లు ఎప్పటికప్పుడూ ప్రత్యక్షంగా తెర మీద కనిపిస్తాయి. కానీ వాటి పేర్లు మాత్రం బయటపెట్టరు. చివరకు అత్యధిక బిడ్ దాఖలు చేసిన సంస్థ పేరును ప్రకటిస్తారు.

రూ.60 వేల కోట్లు పక్కా..
ప్రస్తుతం ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ లు పోటీలో ఉన్నాయి. 2017-2022 కాలానికి గాను (డిస్నీ స్టార్) మీడియా హక్కుల ప్రారంభ ధర రూ. 16 వేల కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా డబుల్ (రూ. 32 వేల కోట్లు) అయింది. పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకున్నా పోటీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే బీసీసీఐ.. రూ. 60 వేల కోట్లు ఆర్జించినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదంటున్నారు మార్కెట్ నిపుణులు.