న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ నిర్వహణకు సమాయత్తం అవుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దానికి ముందు ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరిలో నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే ట్రేడింగ్ విండోను ప్రారంభించిన బీసీసీఐ జనవరి 20లోగా వద్దనుకున్న ఆటగాళ్లను విడుదల చేయాలని జట్లకు సూచించింది. దాంతో మినీ వేలానికి ముందు తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు వదిలేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్-2020లో దారుణంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను విడిచిపెట్టాలని ఆ ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫామ్‌లేమితో సతమతమైన జాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2020లో మొత్తం 8 మ్యాచ్‌లాడిన కేదార్ జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 8 మ్యాచ్‌ల్లో కలిపి కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. ఐపీఎల్ 2018 మెగా వేలంలో జాదవ్‌ను తొలిసారిగా రూ .7.8 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.
ఆ సీజన్‌లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే 24 పరుగులతో చెన్నై టీమ్‌ని గెలిపించిన కేదార్ జాదవ్.. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ 2019 సీజన్‌లో మొత్తంగా 162 పరుగులు మాత్రమే చేసిన జాదవ్.. ప్లేఆఫ్ మ్యాచ్‌లకు గాయంతో దూరమయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కెప్టెన్ ధోనీ వరుసగా అవకాశాలిచ్చినా.. అతను రాణించలేకపోయాడు. దాంతో అతనిపై వేటు పడింది.