హైదరాబాద్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. 114 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ ప్లేస్‌కు చేరింది. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 90 పరుగులతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు 112 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత్.. తాజా విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండు స్థానాలను ఎగబాకింది. ఈ క్రమంలో ఇంగ్లండ్(113)ను వెనక్కు నెట్టింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిన న్యూజిలాండ్ 111 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. 112 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా.. 106 పాయింట్లతో పాకిస్థాన్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్‌లో 267 పాయింట్లతో టాప్‌లో ఉన్న భారత్.. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించి రారాజుగా కొనసాగుతోంది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్‌కు చేరుకునేందుకు మరో 4 మ్యాచ్‌ల దూరంలో (4 టెస్ట్‌లు) ఉంది.
న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101), శుభ్‌మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 113) సెంచరీతో చెలరేగగా... హార్దిక్ పాండ్యా(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీతో మెరిసాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జకోబ్ డఫ్ఫీ, బ్లెయిర్ టిక్‌నర్ మూడు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు కుప్పకూలింది. డెవాన్ కాన్వే(100 బంతుల్లో12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 138) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. హెన్రీ నికోల్స్(42) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ చెరొక వికెట్ తీసారు.