ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. పిచ్ ఏమైనా ప్రభావం చూపుతుందేమో చూసి.. భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాం. మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ఇలాంటి మ్యాచ్‌ల కోసమే మేము క్రికెట్ ఆడుతుంటాం. సెమీఫైనల్లో గెలవడం మాకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇది అతిపెద్ద వేదిక, ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. మా జట్టులో ఒక మార్పు చేశాం. మెక్కాన్చీ స్థానంలో డఫీ ఆడుతున్నాడు.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తాము సంతోషంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయడం పట్ల సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే గత కొంతకాలంగా ముందుగా బ్యాటింగ్ చేయడం మాకు కలిసొస్తుంది.

సెమీఫైనల్, ఫైనల్ వంటి మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి బోర్డుపై పరుగులు ఉంచటం ఎప్పుడూ మంచిదే. గతంలో ఏం జరిగిందనేది ఇప్పుడు చరిత్ర. ఇది కొత్త వరల్డ్ కప్, దీని కోసం మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. టాస్ సమయంలోనే స్టేడియం అంతా నిండిపోయింది. ప్రేక్షకులకు మంచి ఆటను అందిస్తామని ఆశిస్తున్నాం. మా జట్టులో ఎటువంటి మార్పులు లేవు. విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ ఆఫ్ స్పిన్నర్ మెక్కాన్చీ లేకుండా బరిలోకి దిగుతుండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఆఫ్ స్పిన్నర్‌కు ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఆఫ్ స్పిన్నర్ లేకుండా న్యూజిలాండ్ బరిలోకి దిగింది. ఈ నిర్ణయం ఆ జట్టుకు నష్టం చేస్తుందా? లేదా? అనేది చూడాలి. సౌతాఫ్రికాతో సెమీఫైనల్లో మెక్కాన్చీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసాడు. అయినా అతన్ని న్యూజిలాండ్ పక్కనపెట్టింది.
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.