ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుసగా రెండో టైటిల్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. గురువారం వాంఖడే వేదికగా ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా గట్టెక్కింది. సంజూ శాంసన్ విధ్వంసం.. జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్.. అక్షర్ పటేల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్ టీమిండియాను విజేతగా నిలబెట్టాయి.
అయితే ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క తప్పిదంతో ఇంగ్లండ్ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సంజూ శాంసన్ క్యాచ్ నేలపాలు కావడానికి ఓ లిటిల్ గర్ల్ కారణమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో సంజూ శాంసన్ ముందు నిల్చొన్న ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు చేతులు జోడించి దండం పెట్టి మరీ ఆ చిన్నారి జాతీయ గీతాన్ని ఆలపించింది. మ్యాచ్ సమయంలోనే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి కారణంగానే సంజూ శాంసన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఈ లక్కీ గర్ల్‌ను అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు కూడా తీసుకురావాలని బీసీసీఐని కోరుతున్నారు. ఆ చిన్నపాప మ్యాచ్‌కు వస్తే విజయం మనదేనని కామెంట్లు పెడుతున్నారు. ఈ చిన్నారి అమాయకపు నవ్వు, భక్తి అందరినీ కట్టిపడేసాయి. అసలే అహ్మదాబాద్ మైదానం భారత్‌కు అచ్చిరాదు. ఇక్కడ జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో ఇదే వేదికగా సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ వేదికను మార్చాలని ఫ్యాన్స్ డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు లక్కీ గర్ల్‌ను తీసుకురావాలని కోరుతున్నారు.