ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52), ఇషాన్ కిషన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివర్లో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్(3/38) మూడు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ ఒక వికెట్ తీసాడు. భారత బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఈ టోర్నీలో భారత్ మూడోసారి 250 ప్లస్ స్కోర్ నమోదు చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగింది. పోటా పోటిగా బౌండరీలు బాదింది. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన ఆటగాడిగా నిలిచాడు.

ఈ ఇన్నింగ్స్‌తో తన పేలవ ఫామ్‌కు చెక్ పెట్టాడు. అభిషేక్-సంజూ విధ్వంసంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఈ టోర్నీలో పవర్ ప్లేలో భారత్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రచిన్ రవీంద్ర విడదీసాడు. వైడ్ బాల్‌తో అభిషేక్ శర్మను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అభిషేక్ ఔటైనా.. ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ చెలరేగాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన సంజూ వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఫెర్గూసన్ బౌలింగ్‌లో సంజూ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టగా.. ఇషాన్ ఓ సిక్స్ బాదాడు. రచిన్ రవీంద్ర వేసిన 14వ ఓవర్లలో సంజూ శాంసన్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదగా.. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ 6, సింగిల్ తీసి 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సెంచరీకి చేరువైన సంజూ శాంసన్‌ను ఫుల్‌టాస్‌తో జేమ్స్ నిషమ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 105 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఇదే ఓవర్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(0) దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. దాంతో భారత్ పరుగుల వేగం తగ్గింది. హెన్రీ వేసిన 19వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన హార్దిక్.. మరుసటి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో శివమ్ దూబే.. 4, 6, 6, 4, 0, 4 బాది 24 పరుగులు పిండుకున్నాడు. దాంతో భారత్ 255 పరుగుల భారీ స్కోర్ చేసింది.
