ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచేందుకు భారత జట్టు అన్ని మార్గాలను వాడుకుంటుంది. మైదానంలోనే కాకుండా బయటి సెంటిమెంట్స్‌ను కూడా గట్టిగా ఫాలో అవుతుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా తమ హోటల్‌నే మార్చేసింది. పాత హోటల్ అచ్చిరావడం లేదని నమ్మిన టీమిండియా.. ఈ పనిచేసింది.
జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏ నగరంలో మ్యాచ్‌కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయానికి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు రివాజుగా మారిపోయింది.
సెమీఫైనల్‌కు ముందు చంద్రగ్రహణం కారణంగా టీమిండియా తమ ప్రాక్టీస్ సెషన్‌ను గంట వాయిదా వేసుకుంది. చంద్రగ్రహణం ముగిసేవరకు ఆటగాళ్లు ఎవరూ హోటల్ బయటకు రాలేదు. ఇప్పుడు కూడా ఫైనల్ కోసం మరో సెంటిమెంట్‌ను టీమిండియా బలంగా నమ్ముతోంది.
అహ్మదాబాద్‌లో 2023 వన్డే ప్రపంచకప్ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మద హోటల్‌లో బస చేసింది. కానీ ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. తాజా టీ20 ప్రపంచకప్ టోర్నీలోనూ సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్ సమయంలోనూ భారత జట్టు ఈ హోటల్‌లోనే బస చేయగా.. ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతోనే ఆ హోటల్ అదృష్టం లేదని భావించిన టీమ్ మేనేజ్‌మెంట్.. ఈ సారి తాజ్ స్కైలైన్ హోటల్‌కు మారింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీమ్ భావిస్తుంది. మరోవైపు మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ స్టేడియంలో కూడా హోమ్ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ వాడుకోవాలని టీమ్ నిర్ణయించింది.

తుది మ్యాచ్‌కు పిచ్ ఎలా ఉంటుందనే ప్రశ్న కూడా తలెత్తింది. రెండు వారాల క్రితం నల్లమట్టి పిచ్‌పై సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన తర్వాత, భారత జట్టు యాజమాన్యం ఎర్రమట్టి పిచ్‌ను ఎంచుకుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో ఎర్ర, నలుపు, రెండు కలిసిన మూడు రకాల పిచ్‌లు ఉన్నాయి. వాంఖడే స్టేడియంలో ఎర్రమట్టి పిచ్ భారత్ ఉత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. దాంతో ఫైనల్‌కు కూడా ఎర్రమట్టి పిచ్‌ను ఎంపిక చేశారు.
ఆదివారం జరగనున్న ఫైనల్‌కు ముందు, నరేంద్ర మోడీ స్టేడియంలో సుమారు లక్ష మంది ప్రేక్షకులను అలరించడానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రామీ అవార్డు గ్రహీత, ప్యూర్టో రికన్ గాయకుడు రికీ మార్టిన్, 'దాండియా క్వీన్' ఫాల్గుణి పాఠక్, బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ సుఖ్విందర్ సింగ్ అభిమానులను అలరించనున్నారు. టాస్‌కు ముందు ఐసీసీ ఒక మ్యూజిక్ కచేరీని కూడా ఏర్పాటు చేసింది. రికీ మార్టిన్ పాడిన ప్రసిద్ధ పాట 'అన్ దోస్ ట్రెస్ వన్ టూ త్రీ మరియా' పాటకు అభిమానులు స్టెప్పులేస్తారని అంచనా వేస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వెళ్లే అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, మ్యాచ్ రోజున ముంబై నుంచి అహ్మదాబాద్‌కు రైల్వే ఒక ప్రత్యేక రైలును నడపనుంది. విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.