ఐపీఎల్ 2020 సీజన్‌ బరిలో మన తెలుగు క్రికెటర్లు ముగ్గురే!

Andhra and Telangana Cricketers in IPL 2020: Players List, Name And Team Details

హైదరాబాద్: కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ దుబాయ్ వేదికగా పట్టాలెక్కేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దూకుడు పెంచింది. కరోనా ముప్పు నేపథ్యంలో యూఏఈకి తరలించిన భారత బోర్డు.. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతిరానప్పటికీ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఇందులో భాగంగా ఆగస్టు 2న జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) సమావేశంలో లీగ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం అనంతరమే లీగ్ విధివిధానాలకు సంబంధించి తయారు చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ను ఫ్రాంచైజీలకు బోర్డు అందజేయనుంది.

ముగ్గురు మొనగాళ్లు..

ముగ్గురు మొనగాళ్లు..

ఇక ఈ ఐపీఎల్ 2020 సీజన్‌లో మన తెలుగు రాష్ట్రల క్రికెటర్లు ముగ్గురంటే ముగ్గురే బరిలో దిగుతున్నారు. ఇందులో అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్ ఇప్పటికే పలు సీజన్లు ఆడగా హైదరాబాద్ కుర్రాడు బావనక సందీప్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భారత టెస్ట్ బ్యాట్స్‌మన్ హనుమ విహారీ గత సీజన్లలో ఆడినప్పటికీ.. సంప్రదాయక ఆటగాడిగా ముద్ర పడటంతో వేలంలో ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తికనబర్చలేదు. అలాగే ఆంధ్ర రంజీ జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. అండర్-19 ప్లేయర్ తిలక్ వర్మకు కూడా అదృష్టం వరించలేదు. తెలుగు క్రికెట్ అసోషియేషన్‌ల వైఫ్యలమో ఏమో కానీ మన ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం దేవుడెరుగు.. కనీసం ఐపీఎల్‌కు కూడా ఎంపికవ్వడం లేదు.

రాంనగర్ కుర్రాడు సందీప్..

రాంనగర్ కుర్రాడు సందీప్..

హైదరాబాద్‌‌లోని రామ్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల బావనక సందీప్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో సందీప్‌ తన అద్భుతమైన ఆటతీరుని కనబర్చాడు. ఈ టోర్నీలో మొత్తం 7 ఇన్నింగ్స్‌లు ఆడి 261 పరుగులు సాధించగా, అందులో 4 ఇన్సింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచాడు.

18 ఏళ్ల వయసులో 2010లో రంజీల్లో అరంగేట్రం చేసిన సందీప్ తన మొదటి మ్యాచ్‌లోనే జార్ఖండ్‌పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్‌ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 58 రంజీ మ్యాచ్‌లు ఆడి 44.8 యావరేజ్‌తో 3631 రన్స్ చేశాడు. ఇందులో 7 సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 21 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ అయిన సందీప్‌ హైదరాబాద్‌ రంజీ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇన్‌కమ్ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అయిన సందీప్.. ఐపీఎల్‌‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు.

ఆటో డ్రైవర్ తనయుడు..

ఆటో డ్రైవర్ తనయుడు..

ఎంతో మంది అనమాక క్రికెటర్లను ఐపీఎల్ కోటీశ్వరులను చేసింది. ఆ జాబితాకు చెందిన వాడే హైదరాబాద్ స్టార్ మహ్మద్ సిరాజ్. 2017 ఐపీఎల్ వేలంలో అనూహ్యంగా రూ. 2.6 కోట్లు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. 2016-17 రంజీ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ పేసర్ ప్రతిభను పసిగట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ సీజన్ ఐపీఎల్ వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి భారీ మొత్తంలో చెల్లించింది. ఆ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 10 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

ఇక 2018 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.2.20 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 11 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. అయినా కెప్టెన్ కోహ్లీ సిరాజ్‌పై నమ్మకం ఉంచి వరుసగా రెండేళ్లు రిటైయిన్ చేసుకున్నాయి. ఇక గత సీజన్‌లో జట్టు దారణంగా విఫలమవ్వగా..సిరాజ్ కూడా చెత్త ప్రదర్శనను కొనసాగించాడు. 9 మ్యాచ్‌లు ఆడి కేవలం 7 వికెట్లు మాత్రమే తీసాడు. తాజా సీజన్‌లోనైనా సత్తా చాటి భారత జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

ఐపీఎల్ హీరో అంబటి రాయుడు..

ఐపీఎల్ హీరో అంబటి రాయుడు..

అంబటి రాయుడు.. పెద్దగా పరిచయం అక్కర్లేని ఆటగాడు. ఐపీఎల్ అభిమానులకు సుపరిచితమైన ప్లేయర్. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో కన్నా ఐపీఎల్‌తోనే అతని బాంధవ్యం ఎక్కువ. కెరీర్ చరమాంక దశలో ఐపీఎల్‌తోనే భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ అదే ఐపీఎల్ కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. 2010 నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన రాయుడు.. 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం కూడా అదే జట్టులో ఉన్నాడు.

ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు 147 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 3300 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 18 హాఫ్ సెంచరీలున్నాయి. 2018 సీజన్‌లో చెన్నై తరఫున తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రాయుడు.. 16 మ్యాచ్‌ల్లో 43 సగటుతో 602 పరుగులతో జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక గత సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 282 రన్స్ మాత్రమే చేశాడు. ఇక వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయలేదన్న అసహనంతో రిటైర్మెంట్ ప్రకటించి.. అనంతరం వెనక్కు తీసుకున్న రాయుడు ఈ సీజన్ ఐపీఎల్‌లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ మధ్యే అతనికి కూతురు పుట్టగా.. ఆ సంతోషంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, July 30, 2020, 16:21 [IST]
Other articles published on Jul 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more