పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ఒలింపిక్స్ ర్యాంకింగ్ పాయింట్ల వేటలో ఉన్న ఈ భారత స్టార్ షట్లర్ ఈ టోర్నీలో సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో నాలుగో సీడ్ సైనా 17-21, 17-21తో లిన్ క్రిస్టోఫర్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమిపాలైంది. 28 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సైనా కొన్ని మెరుపులు మెరిపించినా.. కీలక సమయాల్లో తడబడి మ్యాచ్ చేజార్చుకుంది.
స్టార్ షట్లర్ సైనా ఓడినా.. ఇండియన్ డబుల్స్ షట్లర్లు, తెలుగు ప్లేయర్లు పంజాల విష్ణువర్ధన్ గౌడ్-గారగ కృష్ణప్రసాద్ అద్భుత ప్రదర్శన చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో కలిసి బరిలోకి దిగిన తమ ఫ స్ట్ టోర్నీలోనే టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ గౌడ్-కృష్ణప్రసాద్ ద్వయం 21-17, 21-17తో కాలమ్ హెమ్మింగ్-స్టీవెన్ స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బెన్ లేన్-సీన్ క్యాండీ (ఇంగ్లండ్) జంటతో విష్ణువర్ధన్-కృష్ణప్రసాద్ ద్వయం ఆడుతుంది.
విష్ణువర్ధన్-కృష్ణప్రసాద్ జోడీగా బరిలో దిగిన తొలి టోర్నీ ఇదే. 21 ఏళ్ల కృష్ణ.. జూనియర్ స్థాయిలో సాత్విక్ సాయిరాజ్‌తో కలిసి డబుల్స్ ఆడేవాడు. కానీ చిరాగ్‌తో సాత్విక్ జట్టు కట్టాక.. ధ్రువ్‌తో కలిసి డబుల్స్ బరిలో నిలిచాడు. 2019లో వీరిద్దరూ విడిపోయారు. 20 ఏళ్ల విష్ణు జూనియర్ స్థాయిలో వివిధ భాగస్వాములతో కలిసి ఆడాడు. ఇషాన్ భట్నాగర్‌తో జతగా 2019లో బల్గేరియా జూనియర్ టోర్నీలో అతడు ఫైనల్ చేరాడు.
మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 18-21, 9-21తో టాప్ సీడ్ జాంగ్‌కోల్ఫాన్-రవింద ప్రజోగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో అశ్విని పొన్నప్ప-ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 9-21, 23-21, 7-21తో నోర్ నిక్లాస్-అమేలియా (డెన్మార్క్) జోడి చేతిలో పరాజయం పాలైంది.