భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఇండోనేసియా సూపర్ సిరీస్ 1000 టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21-14, 21-12తో ప్రపంచ 13వ ర్యాంకర్ రాస్మస్ జెంకె (డెన్మార్క్)ను ఓడించాడు. తొలి గేమ్ నుంచి దూకుడుగా ఆడిన ప్రణయ్ విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో నిలిచాడు. అదే జోరుతో తొలి గేమ్ గెలుచుకున్నాడు.
కానీ రెండో గేమ్‌లో ప్రణయ్‌కు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో స్కోరు 9-9గా మారింది. కానీ బ్రేక్ సమయానికి 11-9తో ఆధిక్యంలో నిలిచిన ప్రణయ్ ఆ తర్వాత ప్రత్యర్థికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. సెమీస్‌లో జావో పెంగ్ (చైనా)తో ప్రణయ్ తలపడనున్నాడు.
అయిదేళ్ల టైటిల్ కరవుకు ముగింపు పలకాలనే పట్టుదలతో ఉన్న ప్రణయ్ గురువారం జరిగిన పురుషుల ప్రి క్వార్టర్స్‌లో 21-11, 21-18 తేడాతో లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచాడు. భారత స్టార్ షట్లర్లు ప్రపంచ 11వ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్, ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్, మాజీ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు, సాయి ప్రణీత్‌లు తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21-23, 10-21తో ప్రపంచ 41వ ర్యాంకర్‌బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలి రౌండ్లో ప్రణయ్ 21-10, 21-9తో 8వ సీడ్ లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు.
మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏడో సీడ్ సింధు 14-21, 18-21తో హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధు క్రాస్ కోర్ట్ షాట్స్ ఆడటంలో ఇబ్బంది పడింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 16-21, 19-21తో హన్స్ క్రిస్టియన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు.