BWF World Championships 2021: ఓడినా.. రజతంతో చరిత్ర సృష్టించిన శ్రీకాంత్

హుయెల్వా(స్పెయిన్): భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌‌లో సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన శ్రీకాంత్‌‌ తుది మెట్టుపై తడబడ్డాడు. అయినా రజతంతో ఈ ఘనత సాధించిన భారత తొలి పురుష షట్లర్‌గా చరిత్రకెక్కాడు. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 43 నిమిషాల్లో 15-21, 20-22తో అన్‌సీడెడ్, ప్రపంచ 22వ ర్యాంకర్‌ లో కీన్‌ యు (సింగపూర్‌) చేతిలో ఓడిపోయాడు.

ఈ ఓటమితో శ్రీకాంత్‌ రజత పతకం సొంతం చేసుకోగా... లో కీన్‌ యు స్వర్ణ పతకం దక్కించుకొని కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్‌ (భారత్‌), ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)లకు కాంస్య పతకాలు లభించాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ప్రైజ్‌మనీ ఉండదనే విషయం తెలిసిందే.

ఆధిప్యత్యం చెలాయించి...

ఆధిప్యత్యం చెలాయించి...

2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో లో కీన్‌ యుపై వరుస గేముల్లో గెలిచిన 28 ఏళ్ల శ్రీకాంత్‌ ఈసారి కూడా గెలుపు రుచి చూస్తాడని అంతా భావించారు. ఆరంభంలో జంపింగ్‌ స్మాష్‌లు, నెట్‌ ఫ్లిక్‌ షాట్‌లతో అలరించిన శ్రీకాంత్‌ 9-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే గత నాలుగేళ్లలో ఎంతో మెరుగుపడ్డ లో కీన్‌ యు ఈసారి శ్రీకాంత్‌ ఆటతీరుపై మంచి ప్రణాళికలతో వచ్చినట్లు కనిపించింది. 3-9తో వెనుకబడ్డా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా ఓపికగా ఆడిన లో కీన్‌ యు నెమ్మదిగా గాడిలో పడ్డాడు.

శ్రీకాంత్‌ సంధించిన స్మాష్‌లను లో కీన్‌ యు అద్భుతంగా డిఫెండ్‌ చేశాడు. శ్రీకాంత్‌ కూడా అనవసర తప్పిదాలు చేయడం సింగపూర్‌ షట్లర్‌కి కలిసి వచ్చింది. నిలకడగా పాయింట్లు స్కోరు చేసిన లో కీన్‌ యు ఎట్టకేలకు 11-11తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత లో కీన్‌ యు జోరు పెంచగా శ్రీకాంత్‌ ఒత్తిడికి లోనై చాలా షాట్‌లు నెట్‌పైకి, బయటకు కొట్టి పాయింట్లు సమర్పించుకున్నాడు. దాంతో లో కీన్‌ యు తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు.

అనవసర తప్పిదాలతో

అనవసర తప్పిదాలతో

రెండో గేమ్‌లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో శ్రీకాంత్‌ 9-6తో ముందంజ వేసినా ఆ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈ స్కోరు వద్ద లో కీన్‌ యు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12-9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు శ్రీకాంత్‌ ఆధిక్యంలోకి రావడం... అంతలోనే చేసిన అనవసర తప్పిదాలతో లో కీన్‌ యు మళ్లీ పుంజుకోవడం జరిగింది. ఈ క్రమంలో లో కీన్‌ యు 20-18తో ముందంజ వేశాడు. శ్రీకాంత్‌ వరుసగా రెండు పాయింట్లు గెలిచి స్కోరును 20-20తో సమం చేశాడు. అయితే వెంటనే లో కీన్‌ యు రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని విశ్వ విజేతగా నిలిచాడు.

సరికొత్త చరిత్ర..

సరికొత్త చరిత్ర..

ఫైనల్లో ఓడినా.. శ్రీకాంత్‌ది సరికొత్త చరిత్రే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ప్రకాశ్‌ పదుకొణె (1983), భమిడిపాటి సాయిప్రణీత్‌ (2019) కాంస్యాలు సాధించగా.. రజత పతకంతో మెరిసిన శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌గా వెలుగొంది.. అనంతరం గాయం కారణంగా కిందికి పడిపోయిన శ్రీకాంత్‌ అసమాన పోరాటంతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 2017 గ్లాస్గో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ప్రదర్శనను భారత్‌ పునరావృతం చేసింది. ఆ టోర్నీలో పి.వి.సింధు రజతం, సైనా నెహ్వాల్‌ కాంస్యం సాధించారు. ఇప్పుడు శ్రీకాంత్‌ రజతం, లక్ష్యసేన్‌ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.

చాలా కష్టపడ్డాను..

చాలా కష్టపడ్డాను..

రజత పతకం సాధించడంపై శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరడం ప్రత్యేకం. ఇందుకోసం నేను చాలా కష్టపడ్డాను ఫైనల్లో రెండు గేముల్లోనూ నాకు మంచి అవకాశాలు వచ్చాయి. కానీ సరిగ్గా ముగించలేకపోయాను. లో బాగా ఆడాడు. ఈ కష్టాన్ని కొనసాగిస్తా. వచ్చే ఏడాది చాలా టోర్నీలున్నాయి. కామన్వెల్త్‌, ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. వీటన్నింటిలో సత్తా చాటడానికి ప్రయత్నిస్తా.'అని తెలిపాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, December 20, 2021, 10:19 [IST]
Other articles published on Dec 20, 2021

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X