తొమ్మిదేళ్ల తర్వాత యుకీ మళ్లీ తెర మీదకి..

Written By:
MYKHel_Uyuki

హైదరాబాద్: తొమ్మిదేళ్ల నిరీక్షణ ఫలించింది. భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యూకీ బాంబ్రీ తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి ఓ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌ మెయిన్‌ 'డ్రా'కు అర్హత సాధించాడు. ప్రతిష్టాత్మక ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో ఈ ఢిల్లీ ప్లేయర్‌ మెయిన్‌ 'డ్రా' బెర్త్‌ దక్కించుకున్నాడు.

పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌లో యూకీ 6-4, 6-2తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌ను ఓడించాడు. మెయిన్‌ 'డ్రా' తొలి రౌండ్‌లో మరో క్వాలిఫయర్‌ నికొలస్‌ మహుట్‌ (ఫ్రాన్స్‌)తో యూకీ తలపడతాడు. ఆ మ్యాచ్‌ గెలిస్తే రెండో రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లుకాస్‌ (ఫ్రాన్స్‌) ఎదురయ్యే అవకాశం ఉంది.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 110వ స్థానంలో ఉన్న యూకీ గతంలో ఒకేఒక్కసారి 2009లో మయామి మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ మెయిన్‌ 'డ్రా'లో ఆడినా... తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఆసియన్ గేమ్స్ వచ్చే లోపు తనను తాను టాప్ 100లో చూడాలనుకుంటున్నట్లు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

షరపోవాకు షాక్‌...
మరోవైపు ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, రెండుసార్లు ఈ టైటిల్‌ నెగ్గిన మరియా షరపోవా (రష్యా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. జపాన్‌ క్రీడాకారిణి నయోమి ఒసాకా 6-4, 6-4తో ప్రపంచ 41వ ర్యాంకర్‌ షరపోవాపై సంచలన విజయం సాధించింది.

Story first published: Friday, March 9, 2018, 9:32 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి