న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2022: జకోవిచ్‌కు చుక్కలు.. తొలి రెండు సెట్లు కోల్పోయినా సెమీస్‌కు సెర్బియా స్టార్!

Wimbledon 2022: Novak Djokovic Battles From Two Sets Down To Reach Semi-final

లండన్: డిఫెండింగ్‌ ఛాంపియన్‌, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్‌ వింబుల్డన్‌ 2022 టోర్నీలో పెద్ద గండాన్ని తప్పించుకున్నాడు. అద్భుతంగా పోరాడి... కష్టంగా సెమీఫైనల్‌ చేరుకున్నాడు. మంగళవారం అయిదు సెట్ల పాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో జకోవిచ్‌ 5-7, 2-6, 6-3, 6-2, 6-2తో ఇటలీ యువ ఆటగాడు సిన్నర్‌పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో ఓడిన తర్వాత జకోవిచ్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. తొలి సెట్‌ జకోవిచ్‌కు పెద్ద షాకే. మొదట్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అతడు.. 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి కూడా సెట్‌ను కోల్పోయాడు.

వరుస సెట్లలో ఓడి..

వరుస సెట్లలో ఓడి..

తొలి గేమ్‌లో అలవోకగా సర్వీసును నిలబెట్టుకున్న జకోవిచ్‌.. రెండో గేమ్‌లో బ్రేక్‌ సాధించాడు. వెంటనే సర్వీసును నిలబెట్టుకున్నాడు. క్రమంగా 4-1తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ సిన్నర్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. 7వ, 11వ గేముల్లో బ్రేక్‌లతో 6-5తో నిలిచిన అతడు.. 12వ గేమ్‌లో సర్వీసు నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకున్నాడు. సిన్నర్‌ రెట్టించిన విశ్వాసంతో రెండో సెట్లో మరింత చెలరేగాడు. కోర్టు అన్ని వైపులా చక్కని షాట్లు ఆడిన అతడు.. మూడు, ఏడో గేముల్లో బ్రేక్‌లతో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. బలమైన ఫోర్‌ హ్యాండ్‌, బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో దూసుకుపోతున్న సిన్నర్‌ను చూస్తే సంచలనం సృష్టిస్తాడేమో అనిపించింది.

అనభవంతో పుంజుకొని..

అనభవంతో పుంజుకొని..

కానీ అనుభవాన్నంతా ఉపయోగించిన జకోవిచ్‌ పుంజుకున్నాడు. మూడో సెట్‌ నాలుగో గేమ్‌లో ట్రిపుల్‌ బ్రేక్‌ పాయింట్‌పై నిలిచిన అతడు.. అలవోకగా బ్రేక్‌ సాధించాడు. తర్వాత సర్వీసు నిలబెట్టుకుని 4-1తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత పెద్దగా ఇబ్బంది లేకుండానే సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అక్కడి నుంచి జకోవిచ్‌కు తిరుగులేకుండా పోయింది. మరింత ఉత్సాహంతో ఆడిన అతడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. జకోవిచ్‌ జోరు ముందు సిన్నర్‌ నిలవలేకపోయాడు. మరోవైపు రెండో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో అతడు 6-4, 6-2, 7-6 (8/6)తో వాండె జాండ్‌షుల్స్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించాడు.

మరియా సంచలన విజయం..

మరియా సంచలన విజయం..

జర్మనీకి చెందిన తజానా మరియా 34 ఏళ్ల వయసులో మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరడం ఆమెకిదే తొలిసారి. క్వార్టర్‌ఫైనల్లో మరియా 4-6, 6-2, 7-5తో జర్మనీకే చెందిన 22 ఏళ్ల నైమియర్‌ను ఓడించింది. దీంతో ఓపెన్‌ ఎరాలో 34 ఏళ్ల వయసులో గ్రాస్‌ కోర్టులో సెమీస్‌ చేరిన ఆరో ప్లేయర్‌గా రికార్డుకెక్కింది. మరియా ఇద్దరు బిడ్డల తల్లి. గత ఏడాదే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. జాబర్‌ (టునీసియా) 3-6, 6-1, 6-1తో బజ్‌కోవా (చెక్‌)ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.

Story first published: Wednesday, July 6, 2022, 8:22 [IST]
Other articles published on Jul 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X