టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన టీమిండియాను అభినందిస్తూ శుభ్‌మన్ గిల్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ పోస్ట్‌లో సంజూ శాంసన్ పేరును ప్రస్తావించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా టీమిండియాకు ఇది మూడో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం.
భారత్ విజయాన్ని కొనియాడుతూ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశాడు. 'మన జట్టును చూసి చాలా గర్వపడుతున్నా. భారత్ కోసం ప్రపంచకప్ గెలవడం ఒక కల. మీరు దేశం మొత్తం గర్వపడేలా చేశారు. అభినందలు బాయ్స్’అని భారత జట్టు జాతీయ గీతాలపన ఫొటోను షేర్ చేసిన గిల్.. మరో పోస్ట్‌లో టీమిండియా టైటిల్ అందుకున్న ఫొటోను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు ఛాంపియన్స్ అనే ట్యాగ్ ఇచ్చాడు.
అయితే ఈ పోస్ట్‌లో శుభ్‌మన్ గిల్ ఏ ఆటగాడిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అభినందించలేదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్‌ను గిల్ మెచ్చుకోకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్‌పై శుభ్‌మన్ గిల్‌కు ఇంత అసూయనా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు జట్టులో చోటు లేకుండా చేసాడనే కోపంతో సంజూ శాంసన్‌ను కొనియాడటం లేదని మండిపడుతున్నారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. పేలవమైన స్ట్రైక్‌రేట్‌తో పాటు వరుస వైఫల్యాలతో గిల్ ఉద్వాసనకు గురయ్యాడు. వాస్తవానికి సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి మరీ శుభ్‌మన్ గిల్‌కు టీమిండియా అవకాశాలు ఇచ్చింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ అతను మాత్రం జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు శుభ్‌మన్ గిల్‌పై వేటు వేసిన మేనేజ్‌మెంట్.. ఇషాన్ కిషన్‌తో పాటు సంజూ శాంసన్‌లను ఓపెనర్లుగా కొనసాగించింది.
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సంజూ విఫలమవ్వగా.. ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రధాన ఓపెనర్‌గా మారాడు. మెగా టోర్నీ ఆరంభంలో సంజూ బెంచ్‌కే పరిమితం కాగా.. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌లో భాగంగా అవకాశం అందుకొని సత్తా చాటాడు. కీలక మ్యాచ్‌ల్లో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు లభించింది. సంజూ శాంసన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు సచిన్, రోహిత్, ధోనీ సంజూ శాంసన్‌ను ప్రత్యేకంగా కొనియాడారు.
టీమిండియాను అభినందించిన ప్రతీ ఒక్కరూ సంజూ శాంసన్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. కానీ శుభ్‌మన్ గిల్.. సంజూ పేరు ఎత్తకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సంజూపై అసూయతోనే గిల్ ఇలా చేశాడని ఆరోపిస్తున్నారు. 'గిల్.. నీ పేలవ ప్రదర్శన కారణంగా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయారు.
'ఇప్పుడు నీ అవసరం జట్టుకు లేదు. మాకు మిస్టర్ ఐసిసి క్లచ్‌మ్యాన్ సంజూ శాంసన్ ఉన్నాడు.' అని ఒకరు కామెంట్ చేయగా... 'ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో మీరు లేకపోవడం ఒక గొప్ప కంట్రిబ్యూషన్. 2028లో జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్ వరకు దయచేసి జట్టుకు దూరంగా ఉండండి' అని ఘాటుగా విమర్శించారు. 'టీ20లలోని మీ చెత్త ఇన్నింగ్స్‌లకు ధన్యవాదాలు. మీ వైఫల్యం వల్ల అర్హుడైన సంజూ శాంసన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించింది. భవిష్యత్తులో దయచేసి ఈ టీ20 జట్టు పరిసరాల్లోకి కూడా రావొద్దు' అని ఇంకొకరు విజ్ఞప్తి చేశారు.