నీది ఏ దేశం అని ప్రశ్నించిన అభిమానికి సానియా మీర్జా సమాధానం ఇదీ!

Posted By:
Sania Mirza shuts down a fan who questioned her nationality

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోషల్ మీడియా వేదికగా ఓ అభిమానికి దిమ్మదిరిగే సమాధానమిచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని కతువాలో 8 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సానియా మిర్జా ట్విట్టర్‌లో గురువారం స్పందించింది. ఈ దారుణ ఘటనకు కొందరు మతం రంగు పులమడాన్ని ట్వీట్‌లో ప్రస్తావిస్తూ, ఇదే నిజమైతే మనం మానవత్వాన్ని కూడా మరచిపోయినట్లే అని పేర్కొంది.

సానియా చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు ఆమెను తప్పుబడుతూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. 'మీరంటే నాకు చాలా గౌరవం. మీ ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు. నువ్వ ఇక ఇండియన్‌ని కావు. కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న నరమేధంపై మాట్లాడరా? అంటూ కిచు కన్నన్ నమో అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.

దీనికి సానియా మిర్జా కాస్తంత ఘాటుగానే స్పందించింది. 'మొదటిది ఎక్కడివారినైనా పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావ్ కదా! ఇక, రెండోది నేను ఏ దేశానికి చెందినదానినో నీ స్థాయి వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇండియాకు ఆడతాను. నేనెప్పటికీ భారతీయురాలినే' అని సానియా మిర్జా గట్టిగా సమాధానమిచ్చింది.

కాగా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో సానియా మిర్జా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, April 12, 2018, 18:33 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి