ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఒడిసిపట్టింది. తద్వారా తన కెరీర్‌లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో తన జైత్రయాత్రను కొనసాగించిన స్వియాటెక్ 68నిమిషాల్లో 6-1, 6-3తేడాతో ప్రపంచ 23వ ర్యాంకర్, అమెరికన్ ప్లేయర్ అయిన 18ఏళ్ల కోకో గాఫ్‌పై గెలుపొందింది. ఇకపోతే ఈ విజయం ద్వారా ట్రోఫీతో పాటు భారీ నజరానాను స్వియాటెక్ గెలుచుకుంది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 22లక్షల యూరోలు దక్కాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 18కోట్ల 30లక్షల భారీ మొత్తం అన్నమాట. అలాగే రన్నరప్‌గా నిలిచిన కోకో గాఫ్‌కు సైతం 11 లక్షల యూరోలు మన కరెన్సీలో రూ. 9కోట్ల 15లక్షల నజరానా లభించింది.
ఈ ఏడాది స్వియాటెక్ తన విజయపరంపర కొనసాగించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌తో సహా కలిపి వరుసగా 35విజయాలు నమోదు చేసింది. 21ఏళ్ల స్వియాటెక్ 2020లో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి విజేతగా నిలిచింది. ఇక రెండో దఫా ఈసారి అనూహ్యంగా ఫైనల్ చేరిన అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ ఆమెకు సవాల్ విసిరేందుకు రెడీ అయింది. అయితే స్వియాటెక్ భీకర ఫాంలో ఉండడంతో కోకో గాఫ్ తలవంచక తప్పలేదు. ఇక ఫైనల్లో కోకో గాఫ్ తీవ్ర ఒత్తిడికి గురయింది. రెండు సెట్లలో కలిసి కేవలం నాలుగు గేమ్‌లు మాత్రమే గెలిచింది. ఇక స్వియాటెక్ ఆరంభం నుంచే తన ఎటాకింగ్ గేమ్‌తో రాణించింది.
పోలాండ్ టెన్నిస్ స్టార్.. లాంగ్ ర్యాలీలకు కోకో గాఫ్‌కు అవకాశమివ్వలేదు. పది ర్యాలీల్లోపే దాదాపు పాయింట్లు సాధించింది. తొలి సెట్ తొలి గేమ్‌లోనే గాఫ్ సర్వీస్‌ను స్వియాటెక్ బ్రేక్ చేసింది. ఇక గాఫ్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయిదో గేమ్‌లో గాఫ్ సర్వీస్‌ను కాపాడుకుని మళ్లీ పోటీలోకి వచ్చినా.. స్వియాటెక్ మాత్రం తన ఉనికిని కోల్పోకుండా మళ్లీ రాణించి.. 6-1తేడాతో గెలుపొందింది. సెట్ 35నిమిషాల పాటు సాగింది. రెండో సెట్‌లో కోకో, స్వియాటెక్ మధ్య కాస్త హోరాహోరీ సాగింది. కానీ స్వియాటెక్ చివర్లో అవకాశమివ్వకుండా రెండు సెట్లలోనే విజయాన్ని ముగించింది.