మెల్‌బోర్న్: అమెరికా స్టార్ ప్లేయర్, 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత సెరెనా విలియమ్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్ చరిత్రలో మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల (24) రికార్డు సమం చేయాలన్న కల మళ్లీ చెదిరింది. ఈ మాజీ ఛాంపియన్ జోరుకు కళ్లెం వేస్తూ ప్రపంచ రెండో ర్యాంకర్ నవోమి ఒసాకా ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమెరికా కెరటం జెన్నిఫర్ బ్రాడీ కూడా తుది సమరానికి అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్, ఎనమిది సార్లు ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. అస్లాన్ కరాత్సెవ్ సంచలనాలకు తెరదించుతూ తుది సమరానికి దూసుకెళ్లాడు.
IPL 2021 Auction: ఎన్నో అంచనాలు పెట్టుకున్న మలన్‌కు షాకే.. తక్కువ ధరకే సొంతం చేసుకున్న పంజాబ్!!
గురువారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మూడోసీడ్ ఒసాకా 6-3, 6-4తో పదో సీడ్ సెరెనాను ఓడించింది. ఆరంభంలో సెరెనా దూకుడుగా ఆడింది. 2-0తో ఆధిక్యంలో నిలిచిన సెరెనా.. ఆ తర్వాత తడబడింది. పేలవమైన సర్వీసులు, రిటర్న్‌లతో పాయింట్లు సమర్పించుకున్న సెరెనా.. 2-5తో వెనకబడి ఆపై సెట్ కోల్పోయింది. రెండో సెట్లో ఒసాకా మరింత దూకుడుగా ఆడింది. తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్ బ్రేక్ చేసింది. కానీ పుంజుకున్న సెరెనా.. ఎనిమిదో గేమ్‌లో బ్రేక్ సాధించి 4-4తో స్కోరు సమం చేసింది. తొమ్మిదో గేమ్‌లో ఒత్తిడిలో పడిన విలియమ్స్ డబుల్ ఫాల్ట్ చేసి వెనుకబడింది. ఒసాకా ఈ గేమ్ గెలవడమే కాక.. తర్వాత సర్వీస్ నిలబెట్టుకుని 6-4తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
అమెరికా అమ్మాయి జెన్నిఫర్ బ్రాడీ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ 22వ సీడ్ 6-4, 3-6, 6-4తో 25వ సీడ్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) పోరాటానికి తెరదించింది. తొలి సెట్ ఆరంభం నుంచి బ్రాడీ దూకుడుగా ఆడి 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే పుంజుకున్న ముచోవా స్కోరు 2-2తో సమం చేసింది. కానీ పదో గేమ్‌లో మరోసారి బ్రేక్ సాధించిన బ్రాడీ సెట్ గెలుచుకుంది. రెండో సెట్లో ముచోవా మెరుగ్గా ఆడింది. నిర్ణయాత్మక మూడో సెట్లో పోరు హోరాహోరీగా నడిచింది. కానీ మూడో గేమ్‌లో ఆధిక్యాన్ని సంపాదించిన బ్రాడీ.. అదే ఊపులో సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ చేరిన ఎనిమిదిసార్లు టైటిల్ కైవసం చేసుకున్న ప్రపంచ అగ్రర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ మరోసారి తుది పోరుకు చేరాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అడుగుపెట్టిన తొలిసారే సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన క్వాలిఫయర్ అస్లాన్ కరత్సెవ్ (రష్యా)పై 6-3, 6-4, 6-2 తేడాతో సెర్బియా వీరుడు జొకో గెలిచాడు. శుక్రవారం డానిల్ మద్వెదెవ్, స్టెఫనోస్ సిట్సిపాస్ సెమీస్ జరుగనుండగా.. ఆ మ్యాచ్ విజేతతో జొకో టైటిల్ కోసం పోటీ పడనున్నాడు.