టీ20 ప్రపంచ కప్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఎంపిక కాలేదు. చివరి నిమిషంలో సెలెక్టర్లు ఇషాన్ కిషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో అతడికి అవకాశం దక్కలేదు. దీనిపై జితేష్ శర్మ తాజాగా స్పందించాడు. టీ20 వరల్డ్ కప్ కంటే అనారోగ్యంతో ఉన్న తండ్రి దగ్గర ఉండటానికే అధిక ప్రాధాన్యత ఇచ్చానని చెప్పాడు. ఆయన తండ్రి ఫిబ్రవరి 1న కన్నుమూశారు. ఈ వ్యక్తిగత విషాదం ప్రపంచ కప్ కోల్పోయిన బాధను కప్పివేసిందని వ్యాఖ్యానించాడు.
టీ20 ఇంటర్నేషనల్స్ ఆడే భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్.. జితేష్ శర్మ. అతని స్థానాన్ని భర్తీ చేశాడు ఇషాన్ కిషన్. రెండు సంవత్సరాలుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ అద్భుతమైన దేశవాళీ ప్రదర్శనలతో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇది ప్రపంచ కప్ ఆడిన జట్టులో జితేష్ శర్మకు చోటు లేకుండా చేసింది. స్వదేశంలో జరిగే ప్రపంచ కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కోల్పోవడం ఎవరికైనా బాధాకరమేనని చెప్పారు.

ఈ విషయంలో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని, ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న తండ్రి పక్కన ఉండాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడించారు. అనారోగ్యానికి గురైన ఫిబ్రవరి 1న కన్నుమూశారని, ఆ ఏడు రోజులు తాను తన తండ్రితో గడిపానని, ఇది తనకు ఓదార్పునిచ్చిందని గుర్తుచేసుకున్నారు. ప్రపంచ కప్ కోల్పోయినప్పటికీ, తన తండ్రికి తన అవసరం ఉందని గ్రహించినట్లు పేర్కొన్నారు.
"టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదనే వార్త విన్నప్పుడు కాస్త నిరుత్సాహానికి గురయ్యాను. నేను మనిషిని కాబట్టి బాధపడటం సహజం. కానీ కాలక్రమేణా, నా కుటుంబం, స్నేహితుల మద్దతుతో ఆ దశ నుండి బయటపడగలిగాను" అని జితేష్ తెలిపారు. నాన్న అనారోగ్యానికి గురయ్యారని, ఆయన ఫిబ్రవరి 1న కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ కంటే నాన్నకే తన అవసరమని ఉందని, ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. ఆయన చివరి రోజుల్లో ఆయన పక్కన ఉండి చూసుకోగలిగానని అన్నారు.
టీమ్ ఇండియా విజయం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని జితేష్ అన్నారు. ఇంటి నుంచే ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూశానని, ఆటగాడిగా మైదానంలో ఉండటం కంటే ఇది చాలా భిన్నమైన, ఒత్తిడితో కూడిన అనుభూతిని ఇచ్చిందని వివరించారు. ఆసియా కప్ నుండి కోచ్, కెప్టెన్ మరియు మొత్తం జట్టు దార్శనికతను వారు నెరవేర్చారని పేర్కొన్నారు. జట్టు విజయం అతనికి వ్యక్తిగత బాధను మరిచిపోయేలా చేసిందని స్పష్టం చేశారు.