న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతాక విజేత, బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా తన లక్ష్యంపై గురిపెట్టాడు. జావెలిన్‌ను 90 మీటర్ల దూరాన్ని విసరడమే లక్ష్యంగా శనివారం ఫిన్లాండ్‌లో జరిగే కోర్టానె క్రీడల్లో అడుగుపెడుతున్నాడు. గత మంగళవారం ఆ దేశంలోనే జరిగిన పావో నూర్మి క్రీడల్లో సరికొత్త జాతీయ రికార్డు (89.30 మీటర్లు) ప్రదర్శనతో అతను సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
టోక్యో ఒలింపిక్స్ తర్వాత తొలిసారి బరిలో దిగిన ఈ క్రీడల్లో అతను 90 మీటర్ల లక్ష్యానికి 70 సెంటీమీటర్ల దూరంలో ఆగిపోయాడు. ఇప్పుడిక కోర్టానె క్రీడల్లో ఆ మార్కును చేరుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను ప్రస్తుతం కోర్టానె ఒలింపిక్ శిక్షణ కేంద్రంలోనే సాధన చేస్తున్నాడు.
వచ్చే నెల 15న ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు సన్నద్ధమవుతున్నాడు. కోర్టానె క్రీడల్లో నీరజ్‌కు.. ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన (97.07మీ) అతని పేరు మీదే ఉంది. కానీ అతను పావో నూర్మి క్రీడల్లో నీరజ్ తర్వాత మూడో స్థానం (86.60మీ)లో నిలిచాడు. స్థానిక అథ్లెట్ ఒలివర్ హెలాండర్ కూడా పసిడిపై కన్నేశాడు.
పావో నూర్మి క్రీడల్లో అతను 89.83 మీ. దూరం ఈటెను విసిరి గోల్డ్ మెడల్ గెలిచాడు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ రజత విజేత జాకుబ్, జులియన్ వెబర్, వెటర్ ఈ పోటీలో పాల్గొనడం లేదు. ఈ ఏడాది కచ్చితంగా 90 మీటర్ల దూరాన్ని చేరుకుంటానని చెప్పిన నీరజ్.. దాన్ని అందుకుంటే ఆ ఘనత సాధించిన ప్రపంచ 21వ జావెలిన్ త్రో అథ్లెట్‌గా రికార్డుకెక్కుతాడు.
ఈటెను 87.58 మీటర్లు విసిరే నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు.
ఇక రాబోయే టోర్నమెంట్లలో ఎలాంటి ప్రదర్శన చేయాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. 'ఈ ఏడాది మరింత నిలకడగా రాణించాలనుకుంటున్నా. నా ఫిట్‌నెస్ కొనసాగిస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని అనుకుంటున్నా. ఇప్పుడు నేను 90 మీటర్ల దూరానికి చేరువలో ఉన్నా. ఇప్పుడు 90+ మీటర్ల రికార్డు చేరితే చాలా సంతోషంగా ఉంటా. నేను ఆ అరుదైన క్లబ్‌లో ఉండాలనుకుంటున్నా' అని నీరజ్ చెప్పుకొచ్చాడు.