కొనసాగుతున్న రెజర్ల ఆందోళన.. ఒలింపిక్ సంఘానికి ఫిర్యాదు! మరోసారి క్రీడా శాఖ మంత్రి చర్చలు!

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ)కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు చేపట్టిన నిరసనలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో రెజ్లర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తాజాగా భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ)కు డబ్ల్యూఎఫ్‌ఐలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అందులో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా రెజ్లర్లు ఒలింపిక్ సంఘం ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. తక్షణమే వీటిని అమలు చేయాలని కోరారు.

'1. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల‌పై దర్యాప్తు జరిపేందుకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి. 2. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్ భూషణ్ వెంటనే రాజీనామా చేయాలి. 3.డబ్ల్యూఎఫ్‌ఐని రద్దు చేయాలి. 4. డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలు కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి ఓ కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి.'అని ఒలింపిక్ సంఘాన్ని కోరారు.

ఈ డిమాండ్లతో పాటు డబ్ల్యూఎఫ్‌ఐలో జరుగుతున్న అవకతవకలను కూడా ప్రస్తావించారు. సీనియర్‌ రెజ్లర్లకు ఒప్పందం ప్రకారం చేసుకున్న చెల్లింపులు పూర్తిగా జరగట్లేదని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన తర్వాత వినేశ్ ఫొగాట్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు మానసికంగా హింసించాడని, దాంతో ఆమె ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్లిపోయిందని తెలిపారు. నేషనల్ అకాడమీలో అర్హత లేని కోచ్‌లు, ఇతర సిబ్బందిని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు నియమించాడని, వాళ్లంతా ఆయన అనుచరులేనని తమ ఫిర్యాదులో వెల్లడించారు.

ఎంతో ధైర్యం కూడగట్టుకుని తాము ఈ ఆందోళనకు దిగామని క్రీడాకారులు తెలిపారు. ఇప్పుడు తాము ప్రాణాల గురించి భయపడుతున్నామన్నారు. కాగా.. బ్రిజ్‌ భూషణ్‌ ఆరోపిస్తున్నట్లుగా తమ వెనుక ఏ రాజకీయ పార్టీ గానీ, పారిశ్రామికవేత్తగానీ లేరని స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ సాయంత్రం మరోసారి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు తనపై వస్తోన్న ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ తీవ్రంగా ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించిన ఆయన.. పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలను బ్రిజ్‌ భూషణ్‌ కొట్టిపారేశారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ హోదాలోకి రాలేదని, ఇప్పుడు కూడా ఎవరితోనూ మాట్లాడలేదని తెలిపారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, January 20, 2023, 17:54 [IST]
Other articles published on Jan 20, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X