షూటింగ్ వరల్డ్ కప్: భారత్‌కు మరో పతకం, పట్టికలో అగ్రస్థానం

Posted By:
 Anjum Moudgil

హైదరాబాద్: మెక్సికో వేదికగా జరుగుతోన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. టోర్నీలో భాగంగా ఆరో రోజు నిర్వహించిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్‌ ఈవెంట్‌లో భారత షూటర్ అంజుమ్‌ మోద్గిల్‌ రజత పతకం సాధించింది.

షూటింగ్‌కు పరిస్థితులు అనుకూలించనప్పటికీ అంజుమ్‌ మోద్గిల్‌ 454.2 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో చండీగఢ్‌కు చెందిన 20 ఏళ్ల అంజుమ్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. చైనాకు చెందిన రుజియో(455.4) స్వర్ణం గెలవగా, ఇదే దేశానికి చెందిన టింగ్ సున్‌ (442.2) కాంస్యాన్ని సాధించింది.

తాజాగా అంజుమ్‌ సాధించిన పతకంతో భారత్‌ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. మూడు బంగారు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో చైనా (2 బంగారు, 2 రజతం, ఒక కాంస్యం) కొనసాగుతోంది.

ఇక, పురుషుల 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టోల్‌ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో పతకం తెస్తాడని భావించిన అనిశ్‌ భన్‌వాలా ఏడో స్థానంలో నిలిచాడు. మరో భారత ఆటగాడు నీరజ్‌ కుమార్‌ 13వ స్థానంలో నిలిచాడు.

Story first published: Friday, March 9, 2018, 13:16 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి