జాబితాలో లేని పేరు: రెజ్లర్ సుశీల్ కుమార్‌కు చేదు అనుభవం

Posted By:
CWG 2018: Wrestler Sushil Kumars Name Missing from Official Website

హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిస్తోన్న వెబ్‌సైట్‌లో క్రీడాకారుల పేర్ల జాబితాలో సుశీల్‌కుమార్‌ పేరు లేదు.

భారత తరుపున 2014 నుంచి అనేక అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటోన్న సుశీల్ కుమార్ పేరు లేకపోవడంపై భారత్‌ రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ), భారత్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 4 నుంచి ఆరంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం సుశీల్‌ కుమార్ ప్రస్తుతం జార్జియాలో శిక్షణ తీసుకుంటున్నాడు.

దీనిపై ఐఓఏ అధ్యక్షుడు నరేంద్రబాత్రా మాట్లాడుతూ 'గోల్డ్‌కోస్ట్‌లో జరగబోయే గేమ్స్‌ నమోదుకు సుశీల్‌ కుమార్ అక్రిడిటేషన్‌ కార్డును పంపాం. భారత్‌ తరఫున వెళ్లే ప్రతినిధుల జాబితాలోనూ సుశీల్‌పేరును సిఫారసు చేశాం. సుశీల్‌ పేరు కనిపించకపోవడంలో ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా అక్కడి అధికారులను కోరాం. ఇందులో మా తరుఫున ఎలాంటి పొరపాటు లేదు' అని అన్నాడు.

ఇక, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అసిస్టెంట్‌ సెక్రటరీ వినోద్‌ తోమర్‌ మాట్లాడుతూ 'గోల్డ్‌కోస్ట్‌ అధికారులు పేర్ల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచడంలో ఎక్కడో సాంకేతిక లోపం తలెత్తి ఉంటుంది. అక్కడి అధికారులతో ఇప్పటికే ఈవిషయంపై చర్చించాం. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియజేయాలని కోరాం. శుక్రవారం సాయంత్రం లోపు కారణం తెలిసే అవకాశం ఉంటుంది' అని అన్నాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనున్న సుశీల్‌కుమార్‌ 74కేజీల విభాగంలో బరిలో దిగనున్నాడు. ఈ పోటీల కోసం ప్రస్తుతం జార్జియాలో శిక్షణ పొందుతున్న సుశీల్ కుమార్ ఏప్రిల్‌ 1న ఢిల్లీకి చేరుకుంటాడు. ఏప్రిల్ 8న ఆస్ట్రేలియాకు బయల్దేరతాడు. మిగతా రెజ్లర్లు సుశీల్ కుమార్ కంటే ముందే ఏప్రిల్‌ 6న ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

Story first published: Friday, March 30, 2018, 19:29 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి