టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి స్వర్ణం: చరిత్ర సృష్టించిన బాత్రా

Posted By:
CWG 2018: Manika Batra wins historic Table Tennis gold

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ జోరుని కొనసాగిస్తున్నారు. పదోరోజైన శనివారం ఆటలో భాగంగా భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు. శనివారం ఒక్కరోజే భారత్ 8 స్వర్ణాలు కైవసం చేసుకుంది.

మహిళల టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌లో మానికా బాత్రా స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన టెన్నిస్ మహిళల సింగిల్స్‌ పైనల్లో మానికా బాత్రా సింగపూర్‌కు చెందిన మియింగ్యూ యుపై 11-7, 11-6, 11-2, 11-7 తేడాతో విజయం సాధించి స్వర్ణం పతకం కైవసం చేసుకుంది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అదిరే ఆటతీరు ప్రదర్శిస్తున్న మానికా అందర్నీ ఆకట్టుకుంటోంది.

మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారత్‌కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో పాటు 22 ఏళ్ల మానికా బాత్రా మహిళల డబుల్స్ రజత పతకం కోసం ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మౌమా దాస్‌తో జతకట్టింది. రజతం కోసం ఆదివారం జరిగే మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది.

మరోవైపు స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్, సౌరబ్ ఘోశల్‌లు పసిడి పోరులో ఆస్ట్రేలియాకు చెందిన పిల్లే కామెరూన్, ఉరుక్‌హఖ్ డోన్నా చేతిలో 0-2 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నారు.

బాక్సర్ వికాస్ కృష్ణన్‌కు స్వర్ణం
బాక్సింగ్‌లో వికాస్ కృష్ణన్ సత్తా చాటాడు. పురుషుల 75 కిలోల విభాగంలో స్వర్ణం సాధించాడు. దీంతో భారత స్వర్ణాల సంఖ్య 25కి చేరింది. గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో పదో రోజైన శనివారం (ఏప్రిల్ 14) ఆటలో భాగంగా భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు.

శనివారం ఒక్క రోజే భారత్ ఖాతాలో 8 స్వర్ణాలు చేరడం విశేషం. ప్రస్తుతం పతకాల పట్టికలో మూడో స్థానంలో భారత్ ఖాతాలో 25 స్వర్ణాలతో పాటు 14 రజతాలు, 18 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 184 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ 117 పతకాలతో రెండో స్థానంలో ఉంది.

భారత్ తర్వాత స్థానంలో ఉన్న కెనడా ఖాతాలో 80 పతకాలు ఉన్నప్పటికీ, పసిడి పతకాల్లో వ్యత్యాసం కారణంగా భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. కెనడా ఖాతాలో ప్రస్తుతం 15 స్వర్ణాలు ఉన్నాయి.

Story first published: Saturday, April 14, 2018, 16:54 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి