కామన్వెల్త్ గేమ్స్ 2018: టేబుల్ టెన్నిస్‌లోనూ భారత్‌కు స్వర్ణం

Written By:
Manika Batra inspired

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ తన సత్తా చాటుతోంది. కామన్వెల్త్‌ క్రీడా గ్రామంలో నాలుగో రోజు భారత్‌ పతకాల పంట పండించింది. భారత్ తరపున టేబుల్‌ టెన్నిస్‌(టీటీ)లో తొలిసారిగా మానికా బత్రా అండ్‌ కో స్వర్ణం సాధించింది. టీమ్‌ ఈవెంట్‌లో భాగంగా ఆదివారం ఢిపెండింగ్‌ చాంపియన్‌ సింగపూర్‌తో జరిగిన ఫైనల్లో భారత్‌ 3-1 తేడాతో విజయం సాధించి పసిడిని సొంతం​ చేసుకుంది.

కామన్వెల్త్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌ స్వర్ణం గెలుచుకోవడం ఇదే తొలిసారి. దీంతో భారత్‌ స్వర్ణాల సంఖ్య ఏడుకు చేరగా పతకాల సంఖ్య పన్నెండుకు చేరింది. మానికా బత్రా, మౌమా దాస్‌, మాధురికా పట్కార్‌, సుత్రితా ముఖర్జీ, పూజా సహస్రాబుదేలతో కూడిన భారత టీటీ జట్టు.. ఏలిన్‌, వాన్లింగ్‌ జింగ్‌, తియాన్వి,మెన్గ్యూ, యిహాన్‌ జోలతో కూడిన పటిష్టమైన సింగపూర్‌ను మట్టికరిపించింది.

అండర్‌ డాగ్‌గా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. అదే ఊపును తుది పోరులో కూడా కొనసాగించిన భారత్‌ ఏకంగా పసిడిని ఖాతాలో వేసుకుఉంది. దాంతో నాలుగో రోజు ఆటలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు దక్కాయి. ఇందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం.

కామన్వెల్త్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత మహిళా జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడం ఇది రెండో సారి. 2010లో జరిగిన సీడబ్ల్యూజీ పోటీల్లో భారత్‌ ఫైనల్స్‌ వరకు చేరినప్పటికీ ఓటమి చవి చూసింది. సోమవారం టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు మ్యాచ్‌ జరగనుంది. ఇక సీడబ్ల్యూజీ బ్యాడ్మింటన్‌ మిక్సిడ్‌లో భారత్‌ తొలిసారిగా ఫైనల్స్‌కు చేరుకుంది.

Story first published: Sunday, April 8, 2018, 19:22 [IST]
Other articles published on Apr 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి