కామన్వెల్త్ గేమ్స్: స్వర్ణంతో బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించారు

Posted By:
Commonwealth Games 2018: India win badminton mixed team gold

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు వరుస పెట్టి పతకాలు సాధిస్తున్నారు. తాజాగా సోమవారం జరిగిన పోటీల్లో మిక్సిడ్ బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణం కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది.

కామన్వెల్త్‌ గేమ్స్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. టీమ్ ఈవెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 3-1 తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ మలేసియాను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. టీమ్ ఈవెంట్ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ అద్భుతమైన విజయాలు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఈ గేమ్స్‌లో మాజీ నంబర్ వన్ లీ చాంగ్ వీని శ్రీకాంత్ ఓడించడం విశేషం. ఒక్క మెన్స్ డబుల్స్ మ్యాచ్‌లో మాత్రమే మలేషియా భారత్‌పై గెలిచింది. అంతకుముందు సెమీ ఫైనల్లో సింగపూర్‌పై విజయం సాధించి తుది పోరుకు చేరిన భారత బ్యాడ్మింటన్‌ టీమ్‌.. అదే ఊపును ఫైనల్లో కూడా కొనసాగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

తొలి మ్యాచ్‌లో అశ్విన్‌ పొన్నప్ప-సాత్విక్‌ జోడి 21-14, 21-14, 21-15 తేడాతో చాన్‌ పెంగ్‌ సూన్‌-గో లి యింగ్‌ ద్వయంపై గెలిచి ఆధిక్యం సాధించగా, ఆపై శ్రీకాంత్‌ 21-17, 21-14 తో చాంగ్‌ లీపై విజయం సాధించాడు. దాంతో భారత్‌కు 2-0తో స్పష్టమైన ఆధిక్యం లభించింది. అయితే, పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఓటమి పాలైంది.

సాత్విక్‌-చిరాగ్‌ జోడి 15-21, 19, 21 తేడాతో ఓటమి పాలైంది. దాంతో భారత్‌ ఆధిక్యం 2-1కు తగ్గింది. ఇక చివరి మ్యాచ్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ 21-11,19-21, 21-9 తేడాతో చీహ్‌పై విజయం సాధించి సైనా నెహ్వాల్‌ భారత్‌కు స్వర్ణాన్ని ఖాయం చేసింది.

తాజా పతకంతో భారత స్వర్ణాల సంఖ్య 10కి చేరగా పతకాల సంఖ్య 19కి చేరింది. సోమవారం భారత్‌కు మూడు బంగారు పతకాలు వచ్చాయి. సోమవారం షూటింగ్‌లో జీతూ రాయ్, ఆ తర్వాత టేబుల్ టెన్నిస్ మెన్స్ టీమ్, ఇప్పుడు బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌‌ స్వర్ణ పతకాలు గెలిచింది.

భారత జట్టు స్వర్ణం సాధించడం పట్ల కోచ్ పుల్లెల గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. డిఫెండింగ్ మలేసియా మీద గెలవడం థ్రిల్ల్‌గా ఉందని నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ అన్నారు. తొలి మ్యాచ్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్వినీ, సాత్విక్‌లు గెలుపొందితే.. తర్వాత శ్రీకాంత్, సైనా అద్భుతంగా రాణించారని గోపీచంద్ తెలిపారు. కొన్నేళ్ల క్రితం వరకూ టీమ్ ఈవెంట్లలో మలేసియాను ఓడించడం ఊహకు అందని విషయం. కానీ భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేశారని గోపీచంద్ ప్రశంసల వర్షం కురిపించారు.

Story first published: Monday, April 9, 2018, 17:28 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి